Hyderbad, Mar 22: పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని (Telangana CM KCR announces 30% pay hike) ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. 30శాతం ఫిట్ మెంట్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల (all govt employees) పాత్ర కీలకమైనది. ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోపాటు, కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది అని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అలానే ‘‘హోంగార్డులు, వీఏవో, వీఆర్‌ఏ, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీ, విద్యా వాలంటీర్లు, సెర్ప్ సిబ్బందికి పీఆర్సీ వర్తింప చేస్తాం. అలానే పెన్షనర్ల వయోపరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తాం. దంపతులైన ఉద్యోగులకు అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నాం. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం అని కేసీఆర్ తెలిపారు.ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు.
సీఎం ప్రకటన పూర్తి చేయగానే పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ... ఆయన దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.