Hyd,Dec 30: దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు (Omicron in TS) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు (Restrictions in Telangana) విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP mahender-reddy) ఉత్వర్వులు జారీ చేశారు. కొత్త సంవత్సర వేడుకలు కూడా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని చెప్పారు. సమావేశాల్లో మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని... ఇంకా మిగిలిపోయినవారు ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. పబ్బులు, ఈవెంట్లలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అధికారులు, కమిషనర్లకు తగిన సూచనలు ఇచ్చాం. ప్రభుత్వ ఆంక్షలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు సూచించారు.
కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను విధిగా పాటించాలి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తుందని స్పష్టం చేశారు. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.