Hyderabad, Jan 4: తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు (Schools, colleges to remain shut in Telangana) ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనావైరస్ (Coronavirus) పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి (CM KCR) అధికారులు తెలిపారు.
గ్రేటర్‌జిల్లాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ (Corona in TS) వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వందలోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది.
విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 423 మందిలో 23 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం 53 శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
రాజధానిలో కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది.