KCR VS TSRTC: ఓ వైపు ఆర్టీసీసమ్మె ఉధృతం, మరోవైపు గల్ఫ్ దేశాలకు కేసీఆర్, ఆందోళనకరంగా ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి, మీ బెదిరింపులకు భయపడేది లేదంటున్న తెలంగాణా ప్రభుత్వం
Ongoing TSRTC strike:TS-cm-kcr Gulf Countries visiting soon (photo-PTI)

Hyderabad, October 12:  గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ సమ్మెతో అట్టుడికిపోతోంది. సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు ఇక వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమై సమ్మెకు మద్దతు తెలపడంతో సమ్మె తీవ్రత బలంగా మారుతోంది. ఖమ్మం బస్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి చేయిదాటిపోయినట్లుగా తెలుస్తోంది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో సమ్మె మరింతగా వేడెక్కింది. ఓ వైపు సమ్మె తీవ్రతరం అవుతుంటే మరోవైపు ప్రభుత్వం కార్మికుల చర్యలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.మూడ్రోజుల్లోగా నూరుశాతం బస్సులు నడపాలని, కొత్త విధానం ప్రకారం బస్సుల నోటిఫికేషన్లు తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.గడువులోగా విధుల్లో చేరని వారు కార్మికులే కాదని, వారితో చర్చలు జరిపేది లేదని మంత్రి పువ్వాడ తెలిపారు.

గూండాగిరీ నడవదు

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులపై అధికారులతో సీఎం ప్రగతి భవన్‌లో సమీక్షించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్‌ స్టాండ్లు, బస్‌ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని సమావేశం నుంచే డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆదేశించారు.

48 వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు

యూనియన్‌ నేతల స్వార్ధ ప్రయోజనాల వల్ల 48 వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. వారితో చర్చలు జరిపేదే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్‌ జీతం వెంటనే విడుదల చేస్తామని సీఎం వివరించారు.

ఈ నెల 19న తెలంగాణా బంద్

సీఎం కేసీఆర్ నిర్ణయంతో సమ్మె పట్ల వెనక్కు తగ్గని కార్మిక సంఘాలు ఏకంగా వారం రోజుల పాటు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 19న తెలంగాణా బంద్ కి పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మెతో కేసీఆర్ గద్దనెక్కారని ఈ సమ్మెతో ఆయన్ని ఇంటికి సాగనంపుతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్‌ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది.

గల్ఫ్‌ దేశాలకు తెలంగాణా సీఎం కేసీఆర్

సమ్మె ఇలా కొనసాగుతుంటే తెలంగాణా సీఎం కేసీఆర్ గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలో తానే స్వయంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నూతన ఎన్‌ఆర్‌ఐ విధానం అధ్యయనం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హాలతో కూడిన బృందం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్‌ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సీఎం సమావేశం కానున్నారు.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం

ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కేసీఆరే బాధ్యత వహించాలని.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని..వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని తెలిపారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని.. పోరాడి సాధించుకుందామని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ మొండి వైఖరి వీడి.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో విలీన ప్రక్రియ లేనే లేదు

ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆర్టీసి భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, సంస్థను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్‌ సహా..అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేస్తే... చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ ఏకంగా ఆర్టీసీని రద్దు చేసిందన్నారు. రైల్వేతో పాటు ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌కు తలసాని సవాలు విసిరారు. ప్రజా రవాణా వ్యవస్తను ప్రభుత్వం మెరుగు పరుస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు.