Hyd, July 1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు (PM Modi to Visit Hyderabad) హాజరవుతున్నారు. మోదీతో పాటు సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేయనున్నట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.హెచ్‌ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4వేల మంది, పేరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది.
నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు (Sec 144 to be imposed in Hyderabad) ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. ఇక, హెచ్‌ఐసీసీ పరిధిలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు. ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలి.
ఈ నెల1 నుంచి 4 వ తేదీ వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. విధుల్లో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోమ్ గార్‌డ్స్లతో పాటు అంత్యక్రియలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిపై 144 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
► శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
► బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3.20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
► 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్ సమయంగా ఉంచారు.
► సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు.
► ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
► సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళతారు.
► సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.
► రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కుగానీ, హోటల్‌కుగానీ చేరుకుని బస చేస్తారు.
► సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
► ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.