Hyderabad, DEC 05: నిన్న రాత్రి అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షోలు వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక (Rashmika), మరికొంతమంది మూవీ టీమ్ వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. మరో బాలుడు స్పృహతప్పి పడిపోవడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, అతని టీమ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ స్టూడెంట్ యూనియన్ అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు చేయగా తాజాగా ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్ పై, సంధ్య థియేటర్ పై (Sandhya Theater) సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు గురించి మీడియాతో డీసీపీ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 9.40 గంటలకు వేసిన పుష్ప-2 ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్ కి భారీగా జనాలు వచ్చారు. అల్లు అర్జున్ తో పాటు కీలక నటీనటులు థియేటర్ కి వస్తారని మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. పబ్లిక్‌ను కంట్రోల్ చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో కూడా ఎలాంటి సెక్యూరిటీని థియేటర్ ఏర్పాటు చేయలేదు.
అల్లు అర్జున్ వచ్చాక అతని సెక్యూరిటీ జనాలను కంట్రోల్ చేయడానికి నెట్టేశారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. ఈ క్రమంలో తోపులాట జరిగి దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి పోలీసులు దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.