Hyderabad, June 13: హైదరాబాద్‌లో వైద్యులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఓ బాలిక రెండు కిలోల వెంట్రుకలను తినేసి కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చింది. జీర్ణాశయంలో పేరుకుపోయిన ఈ రెండు కిలోల వెంట్రుకలను తొలగించి (Hair Ball Removed from Girl’s Stomach) ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆ బాలికను రక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీ కేవలం 68 మందికి మాత్రమే జరిగాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి (Osmania General Hospital) వైద్యులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గగన్‌పహాడ్ ప్రాంతానికి చెందిన పూజిత(17) గత ఐదు నెలలుగా తన తల వెంట్రుకలను మింగేస్తోంది. దీంతో అవి కడుపులో పేరుకుపోయి, మూడు నెలలుగా కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఆ అనారోగ్యాన్ని గుర్తించిన ఆమె సోదరి సంధ్య, గత నెల 24న బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చింది.
పరీక్షల అనంతరం బాలికకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో.. ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచారు.పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండతో ఆ బాలిక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తూ వచ్చింది. నెల క్రితమే శస్త్రచికిత్స చేయాలనుకోగా కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేసి ఆ ఉండను తొలగించారు.