Hyderabad, SEP 17: రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శుభవార్త వినిపించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు (10 per cent reservation) అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. గిరిజనులకు రిజర్వేషన్ల (reservations) పెంపు విషయంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. ఇక విసిగి పోదల్చుకోలేదు. మేం వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాం. నంరేంద్ర మోదీ జీవోను గౌరవిస్తావా..? ఆ జీవోనే ఉరి తాడు చేసుకుంటావా? అని మనవి చేసుకుంటున్నాం. విసిగి పోయాం.. ఇక వేచి చూడలేం. వారం రోజుల్లో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం. దాన్ని అమలు చేసి గౌరవం కాపాడుకుంటావా? లేదంటే దాన్ని ఉరి తాడు చేసుకుంటావా? ఆలోచించుకోవాలి మోదీ అని కేసీఆర్ అడిగారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.. ప్రధాని నరేంద్ర మోదీ ఆ జీవోని అమలు చేసి గౌరవం కాపాడుకుంటావా? లేదంటే దాన్ని ఉరితాడు చేసుకుంటావా?
- సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/Edy1uzUiKi
— TRS Party (@trspartyonline) September 17, 2022
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు మన గిరిజన జాతి 6 శాతం రిజర్వేషన్లు పొందింది. ఆ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏడు సంవత్సరాలు గడించింది. ప్రధాని మోదీని అడుగుతున్నప్పటికీ స్పందన లేదు. విభజన రాజకీయాలు మొదలు పెట్టిన అమిత్ షాను అడుగుతున్నాం. మీకేం అడ్డం వస్తుంది. ఎందుకు ఆపుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. బ్రహ్మాండంగా రిజర్వేషన్లు అమలవుతాయి. ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడించి మోదీని అభ్యర్థిస్తున్నా. మా బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నా. రాష్ట్రపతిగా కూడా ఆదివాసీ బిడ్డనే ఉన్నారు. ఆమె బిల్లును ఆపకపోవచ్చు.
రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతానికి రిజర్వేషన్లు మించొద్దని లేదు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు. ఎందుకు చేతులు రావడం లేదు. ఈ సభ ఏకగ్రీవ తీర్మానం చేస్తోంది. మా బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసి పంపించాలని కోరుతున్నాను. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నారు. మాకు వచ్చే న్యాయమైన హక్కు అడుగుతున్నాం.
రిజర్వేషన్ల విషయంలో పలుమార్లు నేను స్వయంగా అడిగాను మోదీని. రిజర్వేషన్లు మా న్యాయం, ధర్మం అని అడిగాను. ఏపీ నుంచి విడిపోయిన తర్వాత 6 నుంచి 10 శాతానికి గిరిజనులు పెరిగారని చెప్పినప్పటికీ ఇవ్వట్లేదు. ఈ దేశంలో 8 సంవత్సరాల్లో ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా? మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? మన హక్కులు ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ అడిగారు.