
Hyd, Jan 23: TSPSC చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డిని (Retired Telangana DGP M. Mahender Reddy) నియమించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.ఈ పదవికి (TSPSC chairman post) మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం.
ఐపీఎస్ అధికారిగా పనిచేసిన రెడ్డి (M. Mahender Reddy) ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్‌గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించినట్టుగా అనధికారం సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్‌గా నియమితులు కానున్నారు.
గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పైగా డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి TSPSC చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఛైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. TSPSCలో చైర్మ న్ పోస్టుతోపాటు 11 సభ్యుల పోస్టులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.
ఛైర్మన్ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందిన వారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 11 పోస్టుల్లో ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు. ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.