Ministers Sabitha Indra Reddy - Gangula Kamalakar | File Photo

Hyderabad, April 10: కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆపత్కాల సహాయం అందివ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా నేరుగా సిబ్బంది బ్యాంక్ ఖాతాలోకే నగదు పంపిణీ జరగాలని, అలాగే రేషన్ దుకాణం నుంచి 25 కిలోల సన్న బియ్యం ఇచ్చేలా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన వారందరికీ ఆర్ధిక సహాయం, బియ్యం పంపిణీ అందేలా చూడాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మానవీయ కోణంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని అర్హులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని గుర్తించాలని ఆమె కోరారు. విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈ నెల 10వ తేది నుండి 15వ తేది మధ్యన సంబంధిత జిల్లాలకు అందజేయనుందని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుండి 19వ తేది లోపల వివరాల పరిశీలన, ఏప్రిల్ 20 నుండి 24 తేదీల మధ్య వారి బ్యాంక్ అకౌంట్లలో ఆర్ధిక సహాయం జమ కానుందని మంత్రి వెల్లడించారు. అదే విధంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కూడా జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు ఈ పథకం అమలు జరుగుతుందని మంత్రి సబిత స్పష్టం చేశారు.

అనంతరం బి.సి సంక్షేమం, మరియు పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఆయా మండల కేంద్రాలలో బియ్యం నిల్వలు సిద్ధంగా ఉంచామని, వాటిని పంపిణీకి వాడుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. ఈ పథకంలో అర్హులైన వారందరికి పంపిణీ జరగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి సంబంధించిన వివరాలను schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలి. ఆ రికార్డులను విద్యాశాఖ పరిశీలించిన తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ పంపుతుంది.