Supreme Court. (Photo Credits: PTI)

Hyd, Sep 11: గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది

అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్‌ దాఖలు చేశారు.

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు,రూ. 3 లక్షల జరిమానా

అయితే.. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని అంగీకరించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. ఆ ఖాతాలు తన భార్యవని, సేవింగ్స్‌ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మానని, దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు విన్నవించారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం కచ్చితంగా చట్ట ఉల్లంఘన అని డీకే అరుణ తరఫున న్యాయవాది వాదించారు. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు డీకే అరుణ.