File image of Telangana CM KCR | File Photo

Hyderabad, January 11: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ‌ విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, టీకా పంపిణీ సహా పలు శాఖలలోని సమస్యలు మరియు ఇతర కీలక అంశాలపై చ‌ర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రగ‌తి భ‌వ‌న్‌లో సోమవారం  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ మరియు అటవీశాఖ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో విద్యాసంస్థల పునః ప్రారంభానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కరోనాతో 10 నెలలుగా మూతబడిన పాఠశాలలు మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి.

ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

➧ 9వ తరగతి నుండి ఆపై తరగతులను ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

➧ కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

➧ రెవెన్యూకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

➧ ధరణి పోర్టల్ లో అవసరమైన అన్ని రకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

➧ అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.

➧ అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.