Second Wave in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని తెలిపిన స్టేట్ హెల్త్ డైరెక్టర్; రాష్ట్రంలో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదు, 449 మంది రికవరీ, 6912కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus-Representational Image (Photo Credits: PTI)

Hyderabad, August 18: తెలంగాణలో కోవిడ్ -19 సెకండ్ వేవ్ ముగిసిపోయిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, దోమల లార్వా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, పౌరులు కూడా తమ బాధ్యతగా స్వీయ రక్షణ పాటించాలని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్, ఖమ్మం మరియు కొత్తగూడెంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 1,200 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి, 13 జిల్లాల్లో డెంగ్యూతో పాటు మలేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 20 జిల్లాలలో ప్రభుత్వ డయాగ్నస్టిక్స్ సెంటర్లు చురుకుగా పనిచేస్తున్నాయని హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,350 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 424 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,118 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,53,626కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 46 కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,849కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 449 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,42,865 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,912 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.