TS Judges Covid 19: తెలంగాణ కోర్టుల్లో పలువురు జడ్జీలకు కరోనా, రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌‌తో వేగంగా పెరుగుతున్న కేసులు, కోర్టుల్లో భౌతిక విచారణ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, April 6: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు ( High Court) స్పందించింది.

భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే అవకాశముంది.

గతేడాది కంటే తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కరోనా, తెలంగాణలో కొత్తగా 1498 కేసులు నమోదు , రాష్ట్రంలో 10 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు.

కాగా రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ఇంత వేగంగా ఉండటానికి యూకే స్ట్రెయిన్‌ (UK Strain) ఒక కారణమని తెలుస్తోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో 93 నమూనాలను పరీక్షించి, విశ్లేషించగా.. ఏకంగా 12 నమూనాల్లో యూకే స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని మెడ్రిక్సివ్‌ జర్నల్‌ గత నెల 27వ తేదీన ప్రచురించింది. మరోవైపు యూకే స్ట్రెయిన్‌ వేగం 60 శాతం అధికమని పలు అధ్యయనాల్లో తేలింది. ఆర్‌నాట్‌ (వైరస్‌ పునరుత్పత్తి సంఖ్య) కూడా 20 శాతం ఎక్కువని వెల్లడైంది. ఈ నేపథ్యంలో వ్యాప్తి పెరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

స్కూళ్లు నిరవధికంగా మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో తాజాగా 96,982 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు, సరిహద్దులు దాటివచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసిన కర్ణాటక

హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ప్లానింగ్‌ సెక్షన్‌లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. మరో సెక్షన్‌లో ఇద్దరికి కరోనా సోకింది. ఆ కార్యాలయంలో చాలామంది కొవిడ్‌ బారినపడ్డారు. మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో తొలుత ఇద్దరు అధికారులకు, అనంతరం వారి కుటుంబ సభ్యులు, పిల్లలకూ సోకింది. తదుపరి మరికొందరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఆబిడ్స్‌ ఎస్బీఐ కార్యాలయంలో ఒక్కసారిగా చాలామందికి వైరస్‌ నిర్ధారణ అయింది. నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటీవల వివాహానికి హాజరైనవారిలో 40 మందికిపైగా కొవిడ్‌ బారినపడ్డారు.