Hyderabad, April 8: వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ రాణి కుముదిని ఇటీవల జారీ చేశారు. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, సంస్థలకు సెక్షన్ 7 (దుకాణాలు తెరవడం, మూసివేసే గంటలు) నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధించింది.
నిబంధనలు ఏమిటంటే?
- ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి.
- వారాంతపు సెలవులు ఇవ్వడంతోపాటు వారానికి వారి పనిగంటలను నిర్దేశించాలి.
షిఫ్ట్‌కు మించి పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.
- ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేస్తే అందుకు సంబంధించిన వేతనం ఇవ్వాల్సి వస్తుంది.
- మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి.
- నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి ముందుగానే వారి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది.
- వారి రాకపోకలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
- ఆయా షాపులు కచ్చితమైన రికార్డులు నిర్వహించాలి.
- ఆదాయపన్నును సకాలంలో చెల్లించాలి.
- 24 గంటలూ తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
- పోలీసు యాక్ట్, రూల్స్‌ను అంగీకరిస్తేనే షాపులు 24 గంటలూ నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుంది.