Srisailam Power Plant Fire: అగ్ని ప్రమాదంలో ఆరుకు చేరుకున్న మృతుల సంఖ్య, సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్, విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌ సింగ్‌, కొనసాగుతున్న రెస్క్యూ
Fire at Srisailam Power Station in Telangana. (Photo Credits: ANI)

Hyderabad, August 21: శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో మంట‌లు చెల‌రేగిన ప్రాంతం (Srisailam Power Plant Fire) నుంచి ఎన్‌డీఆర్ఎఫ్‌ స‌హాయ‌క సిబ్బంది మరో అయిదు మృత‌దేహాల‌ను వెలుప‌లికి తీసుకువచ్చారు. దీంతో భారీ అగ్ని ప్రమాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత‌ రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్‌లో ఏఈ సుందర్‌ నాయక్‌ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ త‌ర్వాత మోహ‌న్‌తో పాటు మ‌రో న‌లుగురి మృతదేహాలను గుర్తించింది.

ఏఈ సుందర్‌తో పాటు మోహ‌న్‌ మృత దేహాల‌ను బయటకు తరలించారు. గ‌ల్లంతైన‌ మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్‌ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు. ప్ర‌మాద ఘ‌ట‌న గురించి సీం కేసీఆర్‌కు వివ‌రించామ‌ని పేర్కొన్నారు

శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై (Hydroelectric Power Plant Fire) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (TS CM KCR) సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కాగా, శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 9 మంది చిక్కుకుపోగా సీఐఎస్‌ఎఫ్‌ రెస్క్యూ బృందం వారిని రక్షించేందుకు రంగంలోకి దిగింది. అయితే దురదృష్టవశాత్తూ లోపల చిక్కుకుపోయిన వారంతా మృత్యువాతపడ్డారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదం ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాగా, గురువారం రాత్రి 10.35 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు.

ఒక్కసారిగా విద్యుత్‌ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంట‌లు ఆరిపోగా పొగ‌లు మాత్రం ద‌ట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రాగా మ‌రో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాత‌ప‌డ్డారు. మిగ‌తా న‌లుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది.