ST Reservations Hiked to 10% : మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్, ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంపు, జీవో నెంబర్ 33 జారీ చేసిన ప్రభుత్వం, తెలంగాణలో 70 శాతానికి చేరిన రిజర్వేషన్లు, సంబురాల్లో గిరిజనులు
CM KCR Meeting (Photo-TS CMO)

Hyderabad, OCT 01: తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను (ST quota ) ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను (GO no. 33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్లను (Reservations) పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలుకానున్నాయి. సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతిభవన్ కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్షసమావేశం నిర్వహించి రిజర్వేషన్ల పెంపుపై ఆమోదం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 70 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సీ-1, డీ-7, ఇ-4)29, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం, క్రీడలు రెండు, వికలాంగులకు 4శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన, వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై జీవో జారీ చేస్తామని హామీ.. 

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను అమలుచేసేలా వారంరోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశిస్తాం.. ప్రధాని మోదీ మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, కేసీఆర్ చెప్పినట్లుగా వారం రోజుల గడువు పూర్తికావడంతో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.