
Hyderabad, April 26: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వీర విజృంభన కొనసాగుతోంది. గతేడాదిలో పెద్దమొత్తంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాల నుండే వచ్చేవి, కానీ మహమ్మారి యొక్క రెండవ తరంగం తెలంగాణ వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో విస్తరించింది. అన్ని జిల్లాల్లో కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వైరస్ కట్టిడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సులు, 84 మంది లాబ్ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. తద్వారా రూ. 9.02 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది.అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలను నిర్వహించి, అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 73,275 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 6,551 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 4,176 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,01,783కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,418 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 554 కేసులు, రంగారెడ్డి నుంచి 482 మరియు నిజామాబాద్ నుంచి 389 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 43 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,042కు పెరిగింది.
అలాగే ఆదివారం సాయంత్రం వరకు మరో 3,804 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,34,144 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,597 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 50.31 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.
మరోవైపు, మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వీలైనంత మందికి టీకాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.