Adibatla Medico Kidnap Case (Photo-ANI)

Hyd, Dec 12: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్‌కు గురైన యువతి కేసులో (Adibatla kidnapped woman) విచారణ జరుగుతోంది. మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో 32 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సంపద హోమ్స్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన దుండగులు సినీఫక్కీలో వైద్య విద్య అభ్యసిస్తున్న యువతిని కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరోసారి వైశాలి స్టేట్‌మెంట్‌ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్‌ వ్యవహారంలో పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్‌ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. ఏడాదిగా నవీన్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె.

యువతి కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌, తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపిన యువతి, ఆదిభట్ల కిడ్నాప్‌ కేసును చేధించిన పోలీసులు

పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి చెబుతోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో రోజూ హంగామా చేసేవాడట నవీన్‌. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్‌ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది.

షాకింగ్ వీడియో, 100 మందితో యువతిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఇదే, అడ్డువచ్చిన తల్లిదండ్రులను కర్రలతో గాయపరిచిన 100 మంది యువకులు

ఆదిభట్ల పోలీసుల విస్తృత గాలింపు నేపథ్యంలో కిడ్నాపర్లు వదిలి పెట్టడంతో, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.దాడికి పాల్పడిన వారందరూ మిస్టర్‌ టీ పాయింట్‌లలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం 15వ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు వాజిద్, సిద్దు, చందు పరారీలో ఉన్నారని ఆదిబట్ల సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. 36 మంది నిందితుల్లో ముగ్గురు అయ్యప్ప మాల ధరించిన వారు ఉండటం గమనార్హం. కాగా ఈ కేసులో రెండు వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.

యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్‌ రెడ్డితో తనకు ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్‌ తనకు ప్రపోజ్‌ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్‌ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా (assault after kidnap) ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్‌ బ్యాడ్మింటన్‌ ఆడేవాడు. నాకు నవీన్‌ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్‌ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు.

నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్‌ క్రియేట్‌ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్‌తో నా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్‌ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్‌ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు.

ఫ్రెండ్స్‌ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్‌లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్‌గా ఉంటుందని నవీన్‌ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్‌ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్‌ అని నవీన్‌రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు.

మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు. అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్‌ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్‌ చేసిన నవీన్‌, అతని ముఠాను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే నవీన్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది. రెండేళ్లుగా వైశాలి-నవీన్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది.

నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్‌ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ. ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్‌ అండ్‌ డౌన్‌ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు.