Hyd, Feb 23: తెలంగాణ గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Telangana Anti-Corruption Bureau) నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లతో ప్రభుత్వాధికారుల కుమ్మక్కయి రూ. 2.01 కోట్లు మోసం చేశారని అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో తేలింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు ఈ మొత్తం ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని ఏసీబీ (ACB) అధికారులు తెలిపారు.
కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి మార్చి 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈకేసులో (Sheep Distribution Scheme Scam) ఇప్పటికే ప్రధాన నిందితులుగా గుర్తించిన మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. నిందితుల సంఖ్య 6కు చేరింది.ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.ఒక బైక్‌పై ఏకంగా 126 గొర్రెల్ని తీసుకొచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించిన అంశాన్ని కాగ్ బహిర్గతం చేసింది. అలాగే ఆటోలు, బస్సులు, కార్లలోనూ గొర్రెల్ని తరలించినట్లు చూపి నిధుల్ని స్వాహా చేసినట్లు నిగ్గుతేల్చింది.
తెలంగాణలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్) గొర్రెల పంపిణీ పథకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ స్కీంలో (Sheep Distribution Scheme Scam in Telangana) పెద్ద ఎత్తున చేతులు మారాయని ఏసీబీ దర్యాప్తులో తేలింది. పెంపకందారుల స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చి కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు వారి వారి బ్యాంకు ఖాతాలకు బదలి చేయించుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్, స్నేహితులు, పనిమనుషులనే సరఫరాదారులుగా చూపుతూ రికార్డులను ఏమార్చారు.
అధికారులు సహకరించి బినామీలనే అసలైన సరఫరాదారులుగా పేర్కొంటూ సంతకాలు చేశారు. దీంతో బినామీల పేరిటే నుంచి చెక్కులు మంజూరయ్యాయి. అనంతరం బినామీల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన కొద్దిరోజులకే వాటిని తిరిగి మొయినుద్దీన్, ఇక్రమ్ తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మోసంలో నలుగురు అధికారుల పాత్ర బహిర్గతం కావడంతో తాజాగా వారిని అరెస్ట్ చేశారు.