Hyd, Dec 27: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభల్లో ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అభయహస్తం పేరుతో రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేయనున్నారు. రెండు విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
మొదటి విభాగంలో దరఖాస్తుదారుని పేరు (ఇంటి యజమాని), లింగం, కులం, పుట్టిన తేదీ (ఆధార్ ప్రకారం), ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు చిరునామా, రేషన్‌కార్డు నంబర్ ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారుని ఫొటోను కూడా జత చేయాలి. రెండో విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి.
దరఖాస్తు ఫారాలన్నీ బుధవారం రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు చేరతాయని, వీలును బట్టి బుధవారం లేదంటే గురువారం నుంచి జరిగే సభలకు వచ్చే సరికి వాటిని దరఖాస్తుదారులు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుతోపాటు ఆధార్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జతపరచాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. ప్రతిపాదిత లబ్ధిదారులకు సంబంధిత అధికారులు దరఖాస్తును స్వీకరించినట్లు రశీదు అందించాలి.
ఏ పథకం కోసం ఏయే వివరాలివ్వాలో తెలుసుకోండి
► మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం కావాలంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ, సంవత్సరానికి వినియోగించే సిలెండర్ల సంఖ్యను పేర్కొనాలి.
► రైతు భరోసా పథకం కోసమైతే సాగు రైతా లేక కౌలు రైతో పేర్కొనాలి. సాగు రైతు అయితే దరఖాస్తులో పట్టాదారు పాస్‌బుక్ నంబర్ ఇవ్వాలి. కౌలు రైతు అయితే కౌలు చేస్తున్న భూమి వివరాలు సమర్పించాలి. వ్యవసాయ కూలీలైతే ఉపాధి హామీ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది.
► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లులేని వారు ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం అని రాసి ఉన్న చోట టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అమరవీరుడి పేరు, అమరుడైన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్ నంబర్, డెత్ సరి్టఫికెటనంబర్ సమర్పించాలి. ఉద్యమకారులైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా అయిన కేసు తేదీ, సంఖ్య, జైలుకు వెళ్లి ఉంటే వాటి వివరాలను పేర్కొనాలి.
► గృహ జ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి.
► చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పింఛన్ కోసమైతే ఏ కేటగిరీ (వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కారి్మకుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కారి్మకులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి)లో పింఛన్ అడుగుతున్నారో టిక్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగుల రూ. 6 వేల పింఛన్ కోసమైతే సదరం సర్టిఫికెట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.