Hyderabad, Mar 07: తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Budget Session-2020) రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చ సంధర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR) మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు (Congress Leaders) అడ్డుపడుతున్నారంటూ శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఒక రోజు పాటు కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జయప్రకాశ్ రెడ్డి, పోడెం వీరయ్య, అనసూయ, భట్టి విక్రమార్క ఉన్నారు.
సీఏఏపై చర్చకు రెడీ, అన్ని పార్టీల వారికి అవకాశం కల్పిస్తాం
గవర్నర్ తీర్మానంపై చర్చ సంధర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడే మాటలు వినలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ నుంచి పారిపోయారు. వినే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. అధికారంలో శాశ్వతంగా ఎవరూ ఉండలేరు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా 4 శాతం ఓట్లకు పరిమితమైందని చురక అంటించారు.
Here's TS CM KCR Speech
CM Sri KCR speaking on the motion of thanks to Governor address. #TSBudget2020 https://t.co/qGpbkdz5mC
— Telangana CMO (@TelanganaCMO) March 7, 2020
ఎల్లప్పుడూ అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ (Congress Party) తాపత్రయం అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేము గెలిస్తే పైసలిచ్చి గెలిచినట్టా? అని సీఎం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దయతోనే మనం అధికారంలో ఉంటామని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితో ఉందనడానికి సభలో వారి తీరే నిదర్శనమని చెప్పారు. ఇందిరాగాంధీ లాంటి వారు కూడా సామాన్యుల చేతిలో ఓడారు అని గుర్తు చేశారు.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు
ప్రజాస్వామ్య రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2014 ఎన్నికల్లో 63 స్థానాలను గెలుచుకున్నాం. 2018 ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకునే సరికి కాంగ్రెస్‌కు మతి పోయిందని కేసీఆర్ అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ నాయకులు రెండు నెలల పాటు పాట పాడారు. ఆ తర్వాత జడ్పీలన్నీ బ్యాలెట్ పేపర్‌పైనా గెలుచుకున్నామని సీఎం తెలిపారు. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా టీఆర్‌ఎస్సే (TRS) గెలిచింది అని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ వైరస్ ఇక్కడ పుట్టినది కాదు. ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. ఈ 31 మంది కూడా దుబాయ్, ఇటలీ పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. మాస్క్ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి రెండోసారి కూడా ప్రజలు జై కొట్టారన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
20వ తేదీవరకు అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 20వ తేదీవరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. శాసనసభలో 12 రోజులు, శాసనమండలిలో 8 రోజులపాటు సమావేశాల నిర్వహణకు ఎజెండా ఖరారుచేసింది. అసెంబ్లీ ఎజెండాలో భాగంగా 12 రోజులు సమావేశాలు ఉంటాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 9, 10, 15 తేదీలు సెలవురోజులని పేర్కొన్నారు. అలాగే శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. 8 పనిదినాలు వచ్చేలా మండలి ఎజెండాను ఖరారు చేశారు.
అసెంబ్లీ ఎజెండా
శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం
ఆదివారం (మార్చి 8) బడ్జెట్ ప్రసంగం
మార్చి 11న బడ్జెట్‌పై చర్చ ప్రారంభం
మార్చి 12న బడ్జెట్‌పై చర్చకు సమాధానం, ఆమోదం
మార్చి 13న గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా, శిశుసంక్షేమశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 14న రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఎైక్సెజ్, వాణిజ్యపన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, పశుసంవర్ధక, సహకార, పౌరసరఫరాలశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 16న పాఠశాల, ఉన్నత, సాంకేతిక, క్రీడలు, యువజన సర్వీసులు, వైద్యారోగ్యశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 17న పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక, సాంస్కృతిక, ఐటీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌శాఖల పద్దులపై చర్చ, ఆమోదం
18న పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల తదితరశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 19న అసెంబ్లీ, గవర్నర్, మంత్రివర్గం, జీఏడీ, న్యాయ, సమాచార పౌరసంబంధాలశాఖ పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 20 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం
శాసనమండలి ఎజెండా
శనివారం (మార్చి 7న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
ఆదివారం (మార్చి 8న) బడ్జెట్ ప్రసంగం
మార్చి 11న బడ్జెట్‌పై చర్చ
మార్చి 12న బడ్జెట్‌పై చర్చకు సమాధానం, ఆమోదం
మార్చి 13, 14 తేదీల్లో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్‌పై చర్చ, వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానం, పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ
20న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ.