Hyd, Nov 28: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
వరంగల్ బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లే. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే. తెలంగాణ ప్రజలను గోస పెట్టించుకున్నారు.
1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. చాలా రాష్ట్రాలు మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. 50 కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు.
తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్‌ఎస్ పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. వరంగల్ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. వరంగల్‌కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. బీసీలకు సీట్లు ఇచ్చిన ప్రతీ చోటా అందరూ ఏకమై వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కామెంట్స్ చేశారు.
కారులో నోట్ల కట్టలతో సీఐ, రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని చితకబాదిన కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో..
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని, ఉద్యమంలో అతి భారీ బహిరంగసభ ఇక్కడే జరిగిందని, భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో మనం తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తాను అమ్మవారికి కిరీట ధారణ చేసి మొక్కు కూడా చెల్లించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేళ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఈ ఓరుగల్లు నిలిచిందని, ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చిందని, రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టామని తెలిపారు. అలాగే చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పెట్టుకున్నామన్నారు. తద్వారా కాకతీయ రాజులకు మనం నిజమైన నివాళి అర్పించామన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకున్న సమయంలో కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తనను ఆశీర్వదించారని వారిని స్మరించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు తెలంగాణతో పాటు వరంగల్ నియోజకవర్గాల అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతున్నారని, కానీ అంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపారన్నారు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లలో వేశారని గుర్తు చేశారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యం కావాలా? అని ప్రశ్నించారు.