Hyderabad, September 24: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ కొద్దిసేపు మాత్రమే జరిగింది, ఇందులో భాగంగా ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.
కాగా, అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల నిర్వహించాలి? పని దినాల సంఖ్యను శుక్రవారం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం నిర్ణయిస్తుంది. దళిత బంధు పథకం, వ్యవసాయం, కోవిడ్ -19 పరిస్థితి మరియు ఇతర అంశాలు రాష్ట్ర శాసనసభలో చర్చించబడవచ్చు. దళిత బంధుపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన ఇస్తారని భావిస్తున్నారు.
ఎజెండాలో దళిత బంధు పథకం, రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి స్థితిగతులు మరియు ఇతర అంశాలపై సభలో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటువంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా జరిగే అవకాశం ఉండటంతో ఈ సారి సమావేశాలు అధికార- ప్రతిపక్షాల వాదప్రతివాదనలతో వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగిన సుమారు 6 నెలల తర్వాత మళ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ వి భూపాల్ రెడ్డి మరియు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరియు శాసనసభ కార్యదర్శి వి నరసింహ చార్యులు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి గురువారం రోజునే సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి ఎం. మహేంధర్ రెడ్డి మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అసెంబ్లీ స్పీకర్, సభ్యులు లేవనెత్తిన అంశాలకు తక్షణ సమాధానాలు మరియు సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సెషన్ కోసం సంబంధిత విభాగాల నోడల్ ఆఫీసర్‌లు ఆఫీసర్ బాక్స్‌లో ఉండాల్సిందిగా సూచించారు.
గత సెషన్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందించాలని స్పీకర్ కోరారు. అసెంబ్లీ మరియు కౌన్సిల్ ప్రాంగణంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను అమలు చేయాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు.