Hyderabad, Sep 6: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2020) ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ సమావేశాల నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు.
ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను సభ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు (TS Assembly Monsoon Session 2020) ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారినే లోపలికి అనుమతించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులకు కరోనా టెస్టులు చేశారు.
Here's Telangana CMO Tweet
Watch Live: CM Sri KCR speaking in Telangana Legislative Assembly https://t.co/58mO06dLAv
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2020
అసెంబ్లీ ఆవరణలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్ యంత్రాలు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో మాస్కు ధరించని వారి వివరాలు, వారి ఉష్ణోగ్రతలు ఎప్పుటికప్పుడు తెలుస్తాయి. అసెంబ్లీకి వచ్చే ఫైల్స్‌ను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు. సందర్శకులను, ఎమ్మెల్యేల పీఏలను అనుమతించలేదు. మీడియాను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మంత్రుల పేషీ నుంచి ఒక పీఏ, ఒక పీఎస్‌నే మాత్రమే అనుమతించారు.
కొత్త రెవెన్యూ చట్టంపైనే అందరి కన్ను, కరోనా నెగెటివ్ ఉంటేనే అసెంబ్లీలోకి ఎంట్రీ
ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు. ప‌్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. రాష్ర్టఅవతరణకు సహాయ పడిన వారిగా కాకుండా, రాష్ర్ట విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో ప్రణబ్ ఎంతో సహకరించారు అని గుర్తు చేశారు. రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై ప్రణబ్ రాజముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ర్టపతి భవన్‌లో కేసీఆర్‌తో పాటు పలువురం ప్రణబ్‌ను కలిశాం. ఆ సందర్భంగా లక్ష్యం సాధించారంటూ కేసీఆర్‌ను ప్రణబ్ ప్రశంసించారని గుర్తు చేశారు
కాంగ్రెస్‌పార్టీ సమస్యల్లో ఉన్న ప్రతి సందర్భంలో ప్రణబ్ ముఖర్జీయే గుర్తుకొచ్చేవారని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి అన్నారు.