Telangana Assembly Budget Session 2020 congress-mlas-suspend-from-telangana-assembly cm-kcr-fire-on-congress-party-legislatures (Photo-Twitter)

Hyderabad, Sep 7:  కరోనా మహమ్మారి మధ్య తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల నిర్వహణకు (Telangana Assembly Monsoon Sessions) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయ సభలు సోమవారం ఉదయం 11 గంటలకు కొలువుదీరనున్నాయి. కరోనా (Coronavirus) సమస్య పూర్తిగా సమసిపోనప్పటికీ, వరుస సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలు మించకూడదనే నిబంధన మేరకు సభలు నిర్వహిస్తున్నారు. కాగా, తొలిరోజు ఉభయ సభలు సంతాప తీర్మానాలపై చర్చ, ఆమోదానికే పరిమితం కానున్నాయి. దీంతో సోమవారం అసెంబ్లీలో (Telangana State Legislative Assembly) క్వశ్చన్‌ అవర్‌ ఉండబోదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

అంసెబ్లీ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ నివాళి అర్పిస్తుంది. వారికి సంతాపం తెలిపే తీర్మానంపై సభలో చర్చించి, తర్వాత ఆమోదిస్తుంది. ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపైనా స్పీకర్‌ సభలో సంతాప ప్రకటన చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడనుంది. తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీ బీఏసీ (సభా వ్యవహారాల సలహా సంఘం) సమావేశమై, సభ పనిదినాలు, అజెండా అంశాలను ఖరారు చేయనుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం 2 వారాల ముందు నుంచే పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కరోనా టెస్టులు చేశారు. వారితోపాటూ... మార్షల్స్, మీడియా సభ్యులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు అందరికీ టెస్టులు జరిగాయి. కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపించిన వారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

సచివాలయంలో మందిరం, మసీదు, చర్చి, ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనామందిరాల నిర్మాణంపై సమీక్ష

ముఖ్యమంత్రి సహా అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. అసెంబ్లీ, మండలిలో సోషల్ డిస్టాన్స్‌ కోసం 40 సీట్లు, మండలిలో 8 సీట్లు అదనంగా వేశారు. ఈసారి సభ్యులకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్‌లతో కూడిన కిట్లు ఇచ్చారు. అసెంబ్లీ దగ్గర రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, అంబులెన్స్‌లు ఉన్నాయి. మీడియా పాయింట్‌ ఎత్తేశారు. గ్యాలరీలోకి సందర్శకుల్ని అనుమతించట్లేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని కూడా అనుమతించరు.

ఈసారి సభల్లో రెవెన్యూ చట్టం, మరో 4 బిల్లులపై చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేస్తారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, నియత్రిత పద్ధతిల సాగు, రిజిస్ట్రేషన్లు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇప్పటికే సమావేశాల కోసం అధికార టీఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌.. వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.

కరోనా భయంతో కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులు, న‌ల్ల‌గొండ జిల్లా క‌ట్టంగూర్ గ్రామంలో ఘటన, తెలంగాణలో తాజాగా 2,574 మందికి కరోనా

గత అసెంబ్లీ సమావేశాల్లో కరోనాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు విపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు . "రాష్ట్రానికి కరోనా రాకుండా అడ్డుకుంటామని నాడు ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతేకాదు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కరోనా పరీక్షలను తక్కువ చేస్తున్నారు. మరణాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు" అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాలను కనీసం మూడు వారాలపాటు ఈ నెలాఖరు వరకు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విపక్షం కోరితే మరిన్ని రోజులు నిర్వహణకూ ముఖ్యమంత్రి వెనుకాడరని అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంటున్నారు. కాగా, ఈసారి సభలో కరోనా సహా అనేక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసెంబ్లీలో కరోనా, కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విద్యుత్తు విధానం, జీఎస్టీపై కేంద్రం మొండి వైఖరి, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు-వర్గీకరణ, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం, వ్యవసాయ నియంత్రిత సాగు, వర్షాలతో జరిగిన పంటనష్టం, పల్లె-పట్టణ ప్రగతి, బస్తీ దవాఖానాలు, వైద్య సేవల విస్తరణ, హరితహారం, నీటిపారుదల రంగం, ఏపీ ప్రాజెక్టులు, సంక్షేమం, పాలన వికేంద్రీకరణ, మిషన్‌ భగీరథ, శాంతిభద్రతలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పీవీ శతజయంతి ఉత్సవాలు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇటీవల మంత్రులు, విప్‌లతో నిర్వహించిన సమావేశంలో ఈ చట్టాన్ని సభ ముందుకు తేనున్నట్లు స్పష్టత ఇచ్చారు.

అసెంబ్లీ, మండలి సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చకు రానున్న అంశాలు, ప్రభుత్వపరంగా కావాల్సిన సన్నద్ధతపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.