Hyderabad, September 11: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సెప్టెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో రెండు రోజుల పాటు ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ మరియు ఎంఐఎం సభ్యులు పలు సలహాలు, సూచనలు చేశారు. అలాగే వారు లేవనెత్తిన సందేహాలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. చర్చ తర్వాత మూజువాణి ఓటింగ్ ప్రక్రియను చేపట్టిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నూతన రెవెన్యూ బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు సభలో ప్రకటించారు, అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.
తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్ 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం 2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ అనేది శాశ్వతంగా రద్దు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ప్రక్రియలు ఒకేసారి జరగనున్నాయి.
నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త చట్టం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. ఇది అంతం కాదు, ఆరంభమేనని, రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష సభ్యులు చేసిన సూచనలను స్వీకరిస్తామని తెలిపారు.
CM KCR Speaking in Assembly:
Watch Live: CM Sri KCR speaking in Telangana Legislative Assembly https://t.co/oyyeJ3UVxm
— Telangana CMO (@TelanganaCMO) September 11, 2020
అలాగే ధరణి పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూ రికార్డుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు, భూ రికార్డులను ఈ-రికార్డు, డిజిటల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో మూడు రకాలుగా స్టోర్ చేయనున్నట్లు తెలిపారు. ధరణి వెబ్‌సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు నెలకొల్పుతామని, ఇందు కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడబోమని సీఎం పేర్కొన్నారు.
వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్, వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపు పాస్‌బుక్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇకపై రాష్ట్రంలో భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర భూసర్వే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీలైనంత త్వరగా దీనిని నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు.