Basara, August 24: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు (Basara IIIT Scholar Ends Life ) ఉరేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మరోమారు విద్యార్థులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తరగతులు బహిష్కరించి మేయిన్ గేట్ ముందు నిరసనలు చేపట్టారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సురేశ్ రాథోడ్ కుటుంబానికి కోటి రుపాయలు పరిహరం (Students Protest for compensation) చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు బలగాల మోహరింపు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్‌పాస్ట్ చేశాడు.అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్‌లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్‌కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు.తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్‌కు ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.