Hyderabad,Nov 14: తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను (Telangana Legislative Council) భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం (TS Cabinet) నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.
తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గోరటి వెంకన్నకు (Goreti Venkanna) ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటారు. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు.
గోరటి వెంకన్న 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్ ఆఫ్ ద క్రెస్‌సెంట్ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ.. బస్వరాజు సారయ్య (Baswaraju Saraiah) 2014లో టీఆర్ఎస్లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్వరాజు సారయ్య గతంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. 1955లో జన్మించిన బస్వరాజు సారయ్య.. రజక సంఘం జాతీయ నాయకుడుగా ఉన్నారు. మూడు సార్లు కౌన్సిలర్‌గా గెల్చిన ఆయన… ఆ తర్వాత 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా చేశారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ నేత బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఇక ఓసీ కోటాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ గుప్తాను (Dayanand) ఎమ్మెల్సీ పదవి వరించింది. ప్రస్తుతం ఆయన వాసవి సేవా కేంద్రానికి లైఫ్ టైమ్ చీఫ్ అడ్వయిజర్‌గా ఉన్నారు. 2003లో టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దయానంద్ గుప్తా.. 2014లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మెంబర్‌షిఫ్ డ్రైవ్‌లో కూడా ఉత్సాహంగా పాల్గొని వేలాదిమందని పార్టీలో జాయిన్ చేశారు.
నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. శనివారం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.