Hyd, June 9: మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సజీవమైన గోదావరిని చూస్తుంటే తన హృదయం ఉప్పొంగిపోయిందని పేర్కొన్నారు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి అని పాటలు పాడుకున్నాం. కానీ ఇవాళ గోదావరి సజీవంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కావాలనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల కాంక్ష అని కేసీఆర్ తెలిపారు. జిల్లా కోసం ఎన్నో పోరాటాలు, నిరాహార దీక్షలు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పడింది. మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు మొదలు పెడితే రేపటి వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చెప్పొచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పనుల కోసం చెన్నూరు, బెల్లంపల్లి వారు దూరం పోవాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అన్నారు. మీ వద్దకే పరిపాలన వచ్చింది. ఉద్యమ సమయంలో మంచిర్యాలకు వచ్చాను. సింగరేణి కార్మికులు, ప్రజలను ఉద్దేశించి అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఉద్యమ సందర్భంలో జరగాలని కోరుకున్న వాటిని సాధించుకుంటూ తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుకున్నాం. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో మనమే నెంబర్ వన్. తాగునీటి సదుపాయంలో మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇండ్లకు మంచినీటిని సరఫరా చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంట్‌ను రైతాంగానికి అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా 65 వేల కోట్ల పంపిణీ చేశాం అని కేసీఆర్ వివరించారు.
గతంలో పంటలు పండాలంటే నీళ్లు, కరెట్ లేక గోసపడ్డాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ యాసంగిలో భారతదేశం మొత్తం మీద సాగైన వరి పంట 94 లక్షల ఎకరాలు. అందులో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను మించిపోయింది తెలంగాణ. గతంలో ఒక కోటి టన్నులు పండితే చాలా ఎక్కువ అనుకున్నాం. కానీ ఇప్పుడు 3 కోట్ల టన్నులు పండింది. కేంద్ర ప్రభుత్వాల యొక్క దుర్గార్మల పాలసీ లక్ష కోట్ల విలవైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట పండించాలని నిర్ణయించుకున్నాం.
పామాయిల్ పంట వేసేందుకు మంచిర్యాల జిల్లాలో బ్రహ్మండంగా ముందుకు వస్తున్నారు. దాని కోసం పామాయిల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని రూ. 500 కోట్లతో మందమర్రిలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. శంకుస్థాపన చేసుకున్నాం. ఆదివాసీ గిరిజినులకు పోడు భూముల పట్టాలు ఇచ్చుకుంటున్నాం. గొర్రెల విడత పంపిణీ చేసుకున్నాం. ఎంబీసీ కులాల్లో ఉండే నిరుపేదలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని కూడా ప్రారంభించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలంగా ఉంది. సదాశివుడు అనే గొప్ప కవి ఉండేవారు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి అని ఆయన పాటలు రాస్తే మనం పాడుకున్నాం. కానీ ఇవాళ గోదావరి సజీవంగా ఉంది. చెన్నూరు నియోజకవర్గానికి లిప్ట్‌కు శంకుస్థాపన చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచేందుకు రెడీ
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచేందుకు సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడున్న బీజేపీ సర్కార్ సింగరేణిని ప్రయివేటు పరం చేస్తాం అంటున్నారు. ఎంత ఘోరం అంటే.. గోల్ మాల్ చేస్తున్నారు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
దేశంలో బొగ్గుకు కొరత లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఈ దేశంలో ఏ జరుగుతుంది. 361 బలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాక బొగ్గు గనులను, కరెంట్‌ను ప్రయివేటు పరం చేస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కరెంటు ఉద్యోగాలు పీకేస్తాం అంటారు. సింగరేణిని ప్రయివేటు వాళ్లకు అప్పజెప్తామని అంటారు. ఏం పాలసీ ఇది.. ఏం దిక్కుమాలిన పాలసీ ఇది. ఏం జరుగుతుంది ఈ దేశంలో అని కేసీఆర్ మండిపడ్డారు.
సింగరేణి బిడ్డలకు ఒక్కటే మాట విన్నవిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో దండిగా ఖనిజ నిల్వలు ఉన్నాయి. సింగరేణి ఒక వజ్రపు తునక లాంటి మైనింగ్‌లో బాగా కౌసల్యం సంపాదించిన సంస్థ. కాబట్టి తెలంగాణలోని మిగతా గనుల తవ్వకాలను సింగరేణికే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. సింగరేణిని మరింత విస్తృతపరిచి ఒక ఉద్యోగ వనరుగా మార్చబోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
దేశంలో 150 సంవత్సరాల వరకు సరిపడ బొగ్గు ఉన్నా, దాని వాడకుండా ఆస్త్రేలియా నుంచి ,ఇండోనేషియా నుంచి ఎందుకు దిగుమతి చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడానికే మన పార్టీ బీఆర్ఎస్‌గా మారింది. దేశ వ్యాప్తంగా పోరాటానిక నడుం కట్టి ముందుకు పోతున్నాం. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచేందుకు సిద్ధమవుతుంది. మోదీ మనల్ని మోసం చేశారు. సింగరేణిని మోసం చేస్తున్నారు. బొగ్గు నిల్వల గురించి ప్రజలకు తెలియాలి అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చుకుటున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా కరెంట్ ఇవ్వడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో అక్కడ కూడా పవర్ కట్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర పవర్ కట్స్ లేవు. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని తెలంగాణలో ఇస్తున్న మాదిరిగానే దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, పరిశ్రమలకు, సాగునీటి ప్రాజెక్టులకు 150 సంవత్సరాల వరకు కరెంట్ ఇచ్చేంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. దుర్మార్గంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. దీన్ని పసిగట్టి జాగ్రత్తగా వ్యవహరించలి. ముందు ముందు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటది అని కేసీఆర్ తెలిపారు.