
Hyderabad, June 12: కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు సహాయ పడేందుకు వీలుగా అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు (Mobile Phones) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా అనాథ పిల్లలకు (Children Orphaned By COVID-19) స్మార్ట్ ఫోన్లు అందించాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్ణయించింది.
ఈ ఫోన్లలో జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారితోపాటు పలువురు అధికారుల ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ నంబర్లను కాంటాక్టు జాబితాలో ఫీడ్ చేసి అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు చెప్పారు.అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం ఒక్క క్లిక్ తో ఫోన్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే కొవిడ్ సమయంలో తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలున్నారు.
మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నారు. అనాథ పిల్లలకు స్వచ్ఛందసంస్థల సహకారంతో నెలవారీగా రేషన్ కిట్స్ అందించాలని నిర్ణయించారు. సంరక్షకులు లేని అనాథపిల్లలను ఛైల్డ్ హోమ్స్ లకు తరలించారు. అనాథ పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చి చదువు చెప్పించాలని నిర్ణయించారు.