Hyd, Dec 14: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఐదుగురు కేంద్ర మంత్రులని కలిశారు రేవంత్ రెడ్డి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని గుర్తుచేస్తూ ఆ తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని చెప్పారు.
అలాగే, వికారాబాద్ - కృష్ణా స్టేషన్ ల మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య రావాణాకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. ఆ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూల వెనుకబడిన పరిగి, కొడంగల్ తదితర ప్రాంతాలన్నీ సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమలు అభివృద్దికి అవకాశం ఉంటుందని వివరించారు.
కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని సీఎం కోరారు. కల్వకుర్తి నుంచి వంగూరు-కందుకూరు-దేవరకొండ-చలకుర్తి-తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాల-డోర్నకల్, ఇప్పటికే ఉన్న మాచర్ల మార్గాలను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు.డోర్నకల్-మిర్యాలగూడ (పాపటపల్లి-జాన్ పహాడ్), డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని సీఎంగారు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు మార్గాల అలైన్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు సీఎం. 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిన విషయాన్ని తెలియజేశారు.
తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజినల్ రింగు రోడ్డు #RRR ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 AA జాతీయ రహదారిగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని చెప్పారు.దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని. ఆ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదా? అంటూ ప్రశ్న
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రియ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్న విషయాన్ని సీఎం...కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధిగా ఎన్ఓసీ తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.