Jangaon, Oct 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో భవిష్యత్‌లో జనగామ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
‘జనగామ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెలకు వందనం శుభాభివందనం. పల్లా రాజేశ్వర్‌రెడ్డి షురు ఉన్నడు అని తెలుసుకని.. ఇంత హుషారు ఉన్నడని తెల్వది. మీరు ఏం లేదు.. సభ పెట్టిపోతే చాలు.. గెలిచి వచ్చాక అన్ని అడిగి తీసుకుంటు అన్నడు. గొడ్లకు వచ్చిన గోద పెండ పెట్టకపోతదా అన్నట్టు పెద్ద లిస్టు పెట్టిండు. ఈయన కంటే ముత్తిరెడ్డే నయం ఉండే. ఇలాంటి నాయకుడు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాక ముందే సమస్యలు తెలుసుకొని చాలా విషయాలు చెప్పారు.
ఇవన్నీ చేయదగిన విషయాలే చేసి పెడుతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వస్తాయ్. వాటికి ఇబ్బంది లేదు వస్తాయ్. నేను ఒక విషయం చెప్పాలి. చెర్యాల డివిజన్ కావాలని ఉంది. పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొని రండి.. నెల రోజుల్లో చేర్యాల డివిజన్ చేసి పెడుతాను’ అన్నారు.
జనగామలో కండ్లకు నీళ్లు తీసుకొని ఏడ్చాను..
‘జనగామను యాది చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితి, కండ్లకు నీళ్లచ్చే పరిస్థితి. ఉద్యమం జరిగే సమయంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాలు తిరిగినా. ఎనిమిది, పదిచోట్ల కండ్లకు నీళ్లు తీసుకొని ఏడ్చాను. అలా భావోద్వేగానికి గురైన ప్రాంతాల్లో బచ్చన్నపేటలో ఒకటి. సూర్యాపేట వెళ్తున్న సమయంలో బచ్చన్నపేటలో మాట్లాడి వెళ్లాలని పలువురు కోరారు. అక్కడ ఆగి జీపులో మాట్లాడాను. అక్కడ అందరూ ముసలివారే ఉన్నారు.
ఒక్క యువకుడు లేడు. ఎనిమిదేళ్ల కరువుతో బచ్చన్నపేట చెరువు అడుగంటింది. బావుల్లో నీళ్లు లేవు. బోర్లు సరిగా పోస్తలేవు. ఎనిమిది కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నమని చెబుతూ రోదించారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటది.. మనకు హక్కు ఉంటుందని కానీ.. వారానికి ఒకరోజు స్నానం చేయలేని పరిస్థితుల్లో.. యువకులు పొట్టచేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ పోయిన దుస్థితిని ఆ రోజు చూసి ఏడ్చాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చెప్పారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో ఒకటి, రెండు ఎకానమిక్స్ గ్రోత్ సెంటర్స్ కావాలని చెబితే.. వేరే ప్రదేశాలు చెప్పారు. నేను నా పాయింట్ పెట్టి జనగామ పాయింట్ పెట్టాను. రెండోది భువనగిరిపై పెట్టాను. ఈ రెండు గ్రోత్ కారిడార్లు అయ్యాయి. ఈ రోజు నీళ్లు వచ్చిన తర్వాత జనగామలో పాత వరంగల్ జిల్లాలో మొత్తంగా చూస్తే అత్యధికంగా వడ్లు పండించే తాలూకనే జనగామ.
అప్పుడప్పుడు తెలుసుకుంటున్న బచ్చన్నపేట చెరువు సంగతి. ఆనాడు ఎండిపోయింది గానీ.. ఇప్పుడు 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు, ముత్తిరెడ్డి, మిత్రులు సైతం చెప్పడం సంతోషం అనిపించింది. జనగామలో ఏదైతే జరుగాలనుకున్నామో.. ఏ మంచినీళ్లు అమ్ముకునే దుకాణాలు మాయమైపోయి.. మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌కు సమీప ప్రాంతం కావడంతో భవిష్యత్‌లో ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది’ అన్నారు.
‘ఎలక్షన్లు చాలా సందర్భాల్లో వస్తాయి. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. పరేషన్ కావొద్దు. ఎవరో చెప్పారని ఓటు వేయవద్దు. మా బావమరిది చెప్పిండు. మా మ్యాన మామ చెప్పిండు.. మా అన్నగాడు చెప్పిండని ఓటు వేయొద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. మన రాష్ట్ర దశ, దిశను మారుస్తుంది. చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటే పోతది. ఎవరో చెప్పారని నమ్మితే చాలా ప్రమాదం ఉంటది. కొందరు ఆపద మొక్కులు మొక్కే వారుంటారు. ఐదేళ్లు ఎక్కడ కనిపించరు.. ఎన్నికలు మొపుగాంగనే వస్తరు.. ఇష్టం వచ్చినట్లు మాట్లడుతరు. నోటికి వచ్చినట్లు మాట్లడుతరు. మంచి, చెడు గుర్తించి.. మంచి వైపు వెళితే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది’ అన్నారు.
‘సంతోషకరమైన వార్త నేను చెప్పేది ఏంటంటే.. మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయ్. కాళేశ్వరానికి లింకైన మల్లన్న సాగర్ మీ నెత్తిమీద కుండలాగనే 50 టీఎంసీల ప్రాజెక్టు ఉంటది. టప్పాస్‌పల్లి రిజర్వాయర్‌కు దాన్ని లింక్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కరువు వొచ్చినా జనగామకు కరువు అన్నది రాదు. కొన్ని కొన్ని రిపేర్లు, పంట కాలువలు కావాలని కోరారు. కాలువలన్నీ పూర్తి చేయిస్తాం. ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా రెండు, మూడు లిఫ్టులు పెడితే జనగామలో అందరికీ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అవన్నీ తెచ్చి మీకు అప్పగిస్తా. దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగురగానే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మాయమాటలు చెప్పి మోసపోయే ప్రయత్నం చేశారు. కొంత మధ్యలో కాంగ్రెస్ చేసినా అసంపూర్తిగా ఉండే. నదిలో నీళ్లు పోతయి కాని.. దేవాదుల పంపులకు నీళ్లు అందయ్. దాన్ని గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజీ కట్టుకున్నాం. ఆ బ్యారేజీలో 365 నీళ్లు నిలబడి ఉంటయ్. ఇది వరంగల్ జిల్లాకే అంకితం చేశాం. మే నెలలోనూ నీళ్లు అందుబాటులో ఉంటాయి. మంచి బంగారు, వజ్రపు తునకలాంటి వరంగల్‌ను చూడబోతున్నాం’ చెప్పారు.
నిజాయితీ ఉంది కాబట్టే విజయవంతం అయ్యాం..
‘రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండేవో మీకు తెలుసు. కరెంటు లేదు. మంచినీళ్లు, సాగునీరు లేదు. యువకులు వలసవెళ్లి బతుకుతుండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వది. అంచనాలు ఎవరికీ లేవు. చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి. చాలా మంది ఆర్థిక నిపుణులు, జీఆర్‌రెడ్డిలాంటి వారిని పిలిపించి మేధోమథనం చేసి దారి పట్టుకున్నాం. భగవంతుడి దయ వల్ల నిజాయితీ ఉంది కాబట్టి విజయవంతం అయ్యాం. తొమ్మిదేళ్ల కింద మన పరిస్థితి ఎట్ల ఉండే. ఆ నాడు మనం ఏడ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతే లంచాలు పెట్టే పరిస్థితి. మూడు నాలుగు రోజులకు వచ్చే వరకు పొలాలు ఉండుతుండే. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. నాణ్యమైన కరెంటు వస్తుంది.
ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లు కాలుతలేవు. ఎన్ని మోటర్లు ఉన్నయ్.. ఐదు హెచ్‌పీ పెట్టినవా అని అడిగే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలే. గ్రామాలు రైతుల పంటలు పండితే.. తింటే దంగుతయా? అని పెద్దలు అన్నరు. ఇప్పుడు పంటలు ఎంట్ల పండుతున్నయో చూస్తున్నరు. రెండు నెలలు కొనుగోలు చేసినా దంగుతలేవు. హెలికాప్టర్‌లో పోతుంటే గ్రామంలో, రోడ్లపై ఎండబోసిన లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనిపిస్తుంది. దాన్ని చూస్తే మనసు పులకిస్తుంది. తెలంగాణలో అమ్మవారి దయ లక్ష్మీదేవి తాండవం ఆడినట్లు పల్లెలన్నీ కళకళలాడుతున్నయ్. జరంతా మొఖం తెలివికి వచ్చినం. రైతులు ఇప్పుడిప్పుడే అప్పులు మాఫీ చేసుకొని.. వడ్లన్నీ ప్రభుత్వం కొనడంతో మొఖం తెలివి అయినం. ఒకమాదిరి అయినం’ అన్నారు.
నేను చెప్పిందానిపై ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెబుతా. రైతుల భూములు, దానిపై హక్కులు రైతులకు ఉండాలని వాదించింది నేను. నేను మీకు ఒక అధికారం ఇచ్చాను. గతంలో వీఆర్వో ఒకటి రాస్తుండే. గిర్దావరి మరొకటి రాస్తుండే. నాయబ్ తహసీల్దార్ ఇంకోటి, ఎమ్మార్వో ఇంకోటి.. ఆర్డీవో ఇంకోటి.. జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్తే.. ఆయన ఒకటి రాస్తడు. దానిపై కలెక్టర్, దానిపై సీసీఎల్‌ఏ, దానిపై రెవెన్యూ సెక్రెటరీ.. రెవెన్యూ మంత్రి.. ఇవన్నీ కోర్టులుంటుండే. ఇందులో ఎవరికి కోపం వచ్చినా కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు మళ్లీ రైతు మునిగిపోతుండే. నేను కూడా కాపోన్ని కాబట్టి.. నేను వ్యవసాయంలోనే పుట్టినోడిని కాబట్టి.. రైతుల తెలుసుకాబట్టి ఒక పని చేసిన పెట్టాను. గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీవోలకు, రెవెన్యూ మంత్రులకు ఉండే అధికారాన్ని తీసి మీ చేతుల్లో పెట్టాను.
కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు
ఇవాళ మీ భూమిని మార్చాలంటే ఎవరూ మార్చాలేరు. ధరణి తెచ్చిన విప్లవం ఇది. ధోరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతుంది. రైతు భూమిని ముట్టే హక్కు ఎవరికీ లేదు. నీ భూమిని మార్చాలంటే నీవే కర్త.. నువ్వే దర్తవు. నీ బొటనవేలు ముద్రతోనే మారుతుంది తప్ప.. తహసీల్దార్‌కు కాదు.. ముఖ్యమంత్రి కూడా అధికారం లేకుండా చేసిన. మీ భూమిపై అధికారాన్ని మీకే ఇచ్చాం. మళ్లీ ఇవాళ కాంగ్రెస్ నేతలు కౌలు రైతులు అని మాట్లాడుతున్నరు.
కౌలు రైతులు అంటే ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికి ఇచ్చినట్లే. బంజారాహిల్స్‌లోనూ బంగ్లాలు కూడా కౌలుకు ఇస్తరు కదా? ఇక్కడ కూడా కబ్జాదారు కాలమని చెప్పి.. బంజారాహిల్స్ బంగ్లాకు మాఫీ.. రైతులు అగ్గవకు దొరికిర్రు బిడ్డ.. రైతులను గోల్‌మాల్ చేసి.. తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టు తిప్పి నాశనం చేస్తున్నరు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు దాన్ని మారనియ్య అని చెప్పాను’ అన్నారు.
కాంగ్రెస్ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలు పెట్టింది..
‘భూములపై మీ భూముల మీద మీకే హక్కులు ఉండవాలి. కాంగ్రెస్ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలు పెట్టింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఇవాళ ఉన్న పీసీసీ ప్రెసిడెంట్, భట్టి విక్రమార్క ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తమంటున్నరు. మళ్లీ తహసీల్దార్లు, గిర్దావర్లు, వీఆర్వోలు.. నా భూమి నీ మీద రాసి.. నా భూమి రాజేశ్వర్‌కు రాసి.. రాజేశ్వర్‌ది దయాకర్‌రావుకు రాసి తాకులాటలు పెట్టించి.. కోర్టుల చుట్టూ తిప్పితే చచ్చిపోతం. కాంగ్రెస్‌ను బంగాళాఖాతం వేయాలా? ధరణిని బంగాళాఖాతంలో వేయాలా? ఆలోచించాలి. ఓటు అవలోకగా వేయొద్దు. బాగా ఆలోచించి వేయాలి. బంగారు కత్తి అని మొడకోసుకుంటమా? కరెంటు గురించి వాళ్ల మనసులో మాట చెప్పారు. మూడు గంటలు ఇస్తే సరిపోతుందన్నరు.
24గంటలు రైతులకు కరెంటు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఒకటే తెలంగాణ రాష్ట్రం. నిన్నగాక మొన్న కాంగ్రెస్ కర్నాటకలో గెలిచారు. అక్కడ పంటలు ఎండిపోతున్నయ్. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. రైతులు, భూములు సేఫ్‌గా ఉండాలంటే.. ఖచ్చితంగా కాంగ్రెస్‌ను శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న దెబ్బ తగులుతుంది. ఉద్యమాలు చేయడం తప్ప.. ఏం చేయగలిగేది ఉండదు. మనకు కులం, మనం, జాతి లేదు. రైతు బీమా ఎలా కట్టామో.. ప్రభుత్వమే సంవత్సరానికి వేలకోట్లు కట్టి ఎవరూ చనిపోయినా వారంలో రూ.5లక్షలు ఖాతాల్లో జమయ్యేటల్లు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన మూడునాలుగు నెలల్లో బీమా సెట్ అవుతుంది. సహజ మరణం సంభవించినా సాయం అందుతుంది’ అన్నారు.
భువనగిరి జిల్లా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ స్పీచ్
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఒక్కటే విషయం మనవి చేసేందుకు వచ్చాను. పైళ్ల శేఖర్‌రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనను వరుస విజయాలు అందిస్తూ.. సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకుపోతున్నరు. ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో నేడు అద్భుతమైన పంటలు పండుతున్నయ్. ఇక్కడ ఉన్న కాలువలు, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని ఎన్నో కలలు కన్నాం. కాలువల పనులు జరుగుతున్నయ్. త్వరలోనే కంప్లీట్ అవుతాయి’ అని తెలిపారు.
యాదాద్రికి భగవంతుడి పేరు పెట్టుకున్నాం..
‘అన్నింటికి మించి ఈ జిల్లాకు భగవంతుడి పేరును కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరుపెట్టుకున్నాం. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణకాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. జిల్లా అయ్యిందంటే మీ అందరి పోరాట ఫలితం.. తెలంగాణ రాష్ట్రం పుణ్యమా అని భువనగిరి జిల్లాను చేసుకోగలిగాం. మంచి కలెక్టరేట్‌ను నేనే వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది.
మీ అందరి సహకారంతో.. మళ్లీ శేఖర్‌రెడ్డిని గెలిపిస్తారు కాబట్టి.. ఆయన ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98శాతం పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ అయిన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం. దాన్ని ప్రారంభించుకుంటే లక్ష ఎకరాలకు నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. కలల కూడా అనుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని బస్వాపూర్ ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యింది’ అన్నారు.
కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించింది..
‘గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి అరాచక శక్తులను పెంచి పోషించింది. వారు ప్రజలను గోసబుచ్చుకున్నరు. అరాచక, కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్‌ఎస్ ఏరిపారేసిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తున్నరు. దానికి మీ అందరినీ అభినందిస్తున్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దు. వాస్తవమేంటో గుర్తించాలి. మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలి. ఉద్వేగంలో కొట్టుకొనిపోయి ఓటేస్తే మన జీవితాలను తలకింద చేసే పరిస్థితి ఉంటది. ధరణిని అనే పోర్టల్ తెచ్చాం. రైతులకే హక్కులు ఉండాలని.. తరతరాల నుంచి ఉన్నయ్ ఉంటయ్. ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు’ అన్నారు.
ఎన్ని బాధలు పెట్టారో తెలుసు..
‘గవర్నమెంట్‌లో వేరియస్ లెవల్స్‌లో వీఆర్వో నుంచి మొదలుకొని సీఎం వరకు అధికారం ఉండేది. ఎవరో ఒకరికి కోపం వచ్చినా రైతుపేరు తీసి ఒంకొకల పేరు పెట్టేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్‌కు ఎన్ని పాట్లు పడ్డామో తెలుసు. ధరణి పోర్టల్ వల్ల ఒకల భూములను లాక్కునే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు.
ఒకసారి ధరణి పోతే మళ్లీ వీఆర్వోలు, అధికారుల రాజ్యం వస్తుంది. మళ్లీ భూములు కిందమీద అవుతయ్. మళ్లీ తహసీల్దార్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతో మాత్రమే అధికారాన్ని మార్చి.. ప్రభుత్వం మీ వద్దకు తీసుకువచ్చింది. భూమి మారాలంటే మీ వేలి ముద్ర పడితే తప్పా.. వేలిముద్ర పడితే తప్ప.. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఈ అధికారాన్ని ప్రభుత్వం మీకు అప్పగించింది. దాన్ని ఉంచుకోవాల్నా.. పోడగొట్టుకోవాల్నా ఆలోచించాలి’ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. భువనగిరిలో సభలో పాల్గొని మాట్లాడారు. ‘కౌలు రైతు అంటే వ్యవసాయం చేసుకునేందుకు భూమిని మరొకరికి కిరాయికి ఇస్తాం. హైదరాబాద్‌లో భూములను కిరాయికి ఇస్తరు. ఇక్కడెందుకు కబ్జాదారుల పేరు రాయరు.
రైతులు అగ్గువకు దొరికారు.. రైతులతో ఆటాడుకోవచ్చనే దురుద్దేశంతో.. రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా..? మళ్లీ పాత బాధలు కలగాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్ దెబ్బపడుతుంది. మళ్లీ పాత పైరవీకారులు వస్తరు.. వీఆర్వోలు వస్తరు.. రికార్డులు మారుతయ్.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు.
నేను రైతుబిడ్డనే..
‘నేను కూడా రైతుబిడ్డనే. నేను కూడా వ్యవసాయం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నా వట్టిగ ఉంటలేను. రైతుల బాధలు నాకు తెలుసుకాబట్టి మూడేళ్లు కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చాం. ఇంటి నుంచిపోతే పొద్దున 15 నిమిషాల్లో మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని కడుపులో చల్లకదలకుండా ఇంటికి వస్తున్నం. మళ్లీ మునుపటి పరిస్థితి వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. ఇంకొక మాట కూడా మనవి చేస్తున్నా.
ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ బాగుపడ్డది. మన రాష్ట్రం ఏర్పడిన నాడు దారి తెల్వదు. దారి తెలియదు.. కారుచీకటి. కరెంటు లేదు. సాగు, తాగునీరు లేదు ఎన్నో కష్టాలు ఉండే. దారి పట్టుకొని ప్రయత్నం చేస్తే బాగుపడ్డాం. ఇవాళ 24 గంటల కరెంటు ఇచ్చే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. రైతులకు ఎందుకు 24గంటలకు కరెంటు అంటున్నరు. కేసీఆర్ వేస్ట్‌గా ఇస్తున్నడు.. మూడునాలుగు గంటలు ఇస్తే చాలు పొలాలు పారుతయ్ అని చెబుతున్నరు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది’ అని హెచ్చరించారు.
పైరవీకారుల మంద వస్తుంది..
‘ఒక వేళ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా ధరణిపోయి పైరవీకారుల మంద వస్తుంది. వకీలు, కోర్టుల చుట్టూ తిరగాలే. కరెంటు మాయమైతది.. దళితబంధు ఆగమైతది. దళారుల రాజ్యమే వస్తది జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. బోనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం. హైదరాబాద్, ఘట్కేసర్ దాటితే 25 కిలోమీటర్లలోనే ఉంటుంది. మొన్ననే కేటీఆర్‌కు చెప్పాను.. బోనగిరి కూడా ఐటీహబ్ చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలు రావాలి. కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకోవాలని అని చెప్పడం జరిగింది.
త్వరలోనే ఎన్నికల తర్వాత బోనగిరికి స్పెషల్ ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నాది. ఇండస్ట్రియల్ పార్క్‌ను కూడా పెట్టించే బాధ్యత నాది. వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతయ్. నాకున్న సర్వే రిపోర్టుల ప్రకారం బోనగిరి నియోజకవర్గంలో 50వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలువబోతున్నామనే సమాచారం నాకుంది. శేఖర్‌రెడ్డి వేరే చోట సభ పెట్టాలని చెబితే.. నాకు సెంటిమెంట్ ఖచ్చితంగా ఇక్కడే పెడతామని చెప్పడం జరిగింది’ అన్నారు.
పొన్నాలకు చప్పట్లతో స్వాగతం పలకాలి..
‘పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో జనగామలో జాయిన్ అయ్యారు. ఆయనకు చప్పట్లతో ఘనస్వాగతం పలకాలి. కాంగ్రెస్‌లో విసిగి.. వేసారి.. కనీస గౌరవం లేదని చెప్పి.. సంస్కారం లేకుండా ఆ పార్టీ తయారైందని చెప్పి.. కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తానని సీనియర్ నేత మనకు ఆశీస్సులు వచ్చి బీఆర్‌ఎస్‌కు వచ్చారు. ఆయనకు మన అందరి పక్షాన స్వాగతం పలుకున్నాం. అందరినీ కోరేది ఒక్కటే. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి.
శేఖర్‌రెడ్డిని దీవించండి. మనకు కులం, మతం, జాతి భేదం లేదు. నిన్న ఎన్నికల ప్రణాళిక ప్రకటించాం. అన్నివర్గాలను కవర్ చేశాం. మహిళలకు సాధికారత తీసుకువచ్చాం. 93లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉన్న అందరికీ కేసీఆర్ బీమా వస్తుంది. అదేవిధంగా అందరికీ సన్నబియ్యే వస్తయ్ నా మాటగా హామీ ఇస్తున్నా. మిగతా కార్యక్రమాలు ఏవి జరుగుతున్నాయో అవన్నీ కొనసాగిస్తూ.. కార్యక్రమాలను మీకు అందిస్తాం’ అన్నారు.
భువనగిరిలో ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం
‘యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో.. ఈ జిల్లా భవిష్యత్‌లో అద్భుతంగా బంగారు తునకలాగ తయారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ రాక ముందు చాలామంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పారు. ఇవాళ భూముల ధరలు ఎటున్నయో మీకు తెలుసు. యాదగిరిగుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు.. సాయంత్రమైతే ఓ రేటు.. రాత్రయితే ఓ రేటు ఉన్నది.
కోట్లలో రూపాయలు పలుకుతున్నది. తెలంగాణలో బ్రహ్మాండంగా భూములు పెరుగుతున్నయ్. భూములేని వారికి న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మిని ప్రకటించాం. మళ్లీ గెలిపిస్తే తప్పకుండా భువనగిరి అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. మళ్లీ ఎన్నికల తర్వాత బస్వాపూర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం చేసుకుంటా. పైళ్ల శేఖర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను’ అంటూ పిలుపునిచ్చారు.