CM KCR (Photo-Twitter/TS CMO)

Hyd, June 20: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే పాలమూరు పూర్తి కావాల్సిందని, పుణ్యాత్ములు కాంగ్రెసోళ్ల వల్లే ఆలస్యమైందని తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల దాదాపు 85 శాతం పూర్తయిందని, ఆగస్టులో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లు నింపుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టులో కేసులు వేయటంతోనే ప్రాజెక్టు ఆలస్యమవుతున్నదని, కృష్ణా నుంచి కాకపోతే గోదావరి నీళ్లు పారిస్తానని భరోసా ఇచ్చారు.

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాలకు కాళేశ్వరం జలాలను తరలిస్తామని తెలిపారు.

ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ

రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లిలో నాకుగతంలో పదిపదిహేను ఎకరాలు ఉండేది. 20 బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగా పోసే బోర్లతో అనేక కష్టాలు పడ్డాం. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం తెలంగాణలో ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఓ చిన్న లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్, పరిగి సహా చేవెళ్ల, మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. కొండపోచమ్మ కింది నుంచి ఘట్‌కేసర్‌ మీదుగా కాళేశ్వరం నీళ్లను మూసి దాటించి లోయపల్లి రిజర్వాయర్‌ను నింపడం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా మంది హేళన చేశారు. తెలంగాణ వారికి పంటలు పండించడం రాదన్నారు. కరెంట్‌ లేక చీకట్లో మగ్గుతామన్నారు. ప్రస్తుతం దేశంలోనే ధాన్యం దిగుబడిలో, తలసారి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొక్కలను నాటి చెట్లను పెంచడంలో ముందుంది. 100 శాతం ఓడీఎఫ్‌ సాధించడంలోనూ ముందున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ టాప్‌లో నిలిచింది. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

కేసీఆర్‌కు మహారాష్ట్రలో అంత సీన్ లేదు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు, ఆ ప్రచార డబ్బంతా ఎక్కడిది అంటూ విమర్శలు

నేను హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు హేళన చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంపై జోకులు వేసి నవ్వుకున్నారు. కానీ హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 శాతం ఉన్న పచ్చదనం 30శాతం దాటింది. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే 267 కోట్ల మొక్కలు నాటాం. ఇప్పటికే 170 అర్బన్‌ ఫారెస్ట్‌లను పూర్తి చేసుకున్నాం.

ఇది మనందరి విజయం. హరితహారంలో భాగంగా ఈ ఏడాది పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు రూ.100 కోట్ల బడ్జెట్‌ పెట్టాల్సిందిగా ముఖ్య కార్యదర్శికి సూచించాం. హరితహారం చట్టం తెచ్చినప్పుడు సర్పంచులు నాపై కోపం తెచ్చుకున్నారు. అయినా కష్టపడి పనిచేశారు. ఫలితంగా మోడువారిన దారులన్నీ నేడు పూల తేరులయ్యాయి. గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కుతుంది.

అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం ఇస్తున్నాం. మనిషినైతే తేలేం కానీ కొన్ని డబ్బులు ఇచ్చాం. 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫారెస్ట్‌ ఆఫీసర్లకు సాయుధ సాయం అందజేయాలని నిర్ణయించాం. అటవీ అధికారుల భద్రత కోసం తెలంగాణవ్యాప్తంగా 20 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు మహేశ్వరంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. జల్‌పల్లి, తుక్కుగూడ, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ మున్సిపాలిటీలకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.