CM KCR Press Conference: సర్జికల్‌ స్ట్రైక్స్‌పై నాకు ఎన్నో అనుమానాలున్నాయి, అడిగితే రాహుల్ గాంధీని అంత ఘోరంగా అవమానిస్తారా, కేంద్రంపై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR Fire (photo-Twitter)

Hyd, Feb 15: భారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియాతో (CM KCR Press Conference) మాట్లాడిన సీఎం.. రాహుల్‌గాంధీ సర్జికల్‌ స్ట్రైక్స్‌కు (Telangana CM K Chandrashekhar Rao questions surgical strike) ఆధారాలు అడగడం తప్పేం కాదు. నేను కూడా ఆధారాలు అడుగుతున్నా. కేంద్రం ముందుకొచ్చి చూపించాలి. ప్రజల్లో పలు అనుమానాలున్నాయి.

బీజేపీది తప్పుడు ప్రచారం. ఫాల్స్‌ ప్రచారం. ప్రజలు ఎందుకు ఆధారాలు అడగకూడదు. ప్రజాస్వామ్యంలో మీరు మోనార్క్‌ కాదు. రాజు కాదు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నేతగా, ఎంపీగా అడిగే హక్కున్నది. దానికి సమాధానమివ్వాలి. అంతేగాని అస్సాం ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడతారా? ఎంపీ రాహుల్‌గాంధీ పట్ల అసభ్యంగా మాట్లాడిన తీరును మేం ఖండిస్తున్నాం.నేను కాంగ్రెస్‌కు సపోర్టు చేయట్లేదు. రాహుల్‌ గాంధీ మీద వేసిన నిందను ఖండిస్తున్నా. నేను నిజాయితీగా, దేశ పౌరుడిగా ఇది పద్ధతి కాదని చెప్తున్నా.

Here's KCR press conference 

ధర్మం కాదు. నువ్వు వెధవ అను.. నువ్వు అసమర్థుడివి అను, నీకు చేతకాదు అను.. అట్ల ఉంటది కానీ ఇదేం పద్ధతండీ. అట్ల మాట్లాడవచ్చునా? దాన్ని సహించడమనేది మన దేశానికే మంచిది కాదు. మన సమాజానికి మంచిది కాదు. నేను సోనియాగాంధీని అవమానించలే. ఎవరినీ అవమానించలే. నాకసలు ఆ భాషే రాదు. నేను కఠినంగా మాట్లాడుత. కాస్త గట్టిగ మాట్లాడి చెప్తా. అంతేకానీ ఈ దుర్మార్గమైన, అసహ్యమైన పదజాలం మాకు రాదు. అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎవరూ మాట్లాడలేనివి. నా జీవితంలో ఎప్పుడూ మాట్లాడలే. మాట్లాడని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

అమెరికా రాజకీయాల్లో వేలు పెట్టడం అవసరమా? అంటూ మోదీపై కేసీఆర్ ఫైర్, కొత్త స్పూర్తి కోసం కొత్త చట్టం రావాల్సిందేనన్న తెలంగాణ సీఎం, అవసరమైతే జాతీయ పార్టీ పెడతా!

సర్జికల్‌ స్ట్రైక్స్‌ (surgical strike by Indian Army) రాజకీయ స్టంట్‌ అని సగం దేశం నమ్ముతున్నది. ఏదో రాష్ట్రంలో ఎన్నికలు రాంగనే సరిహద్దుల్లో సమస్య సృష్టించడం, దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోవడం బీజేపీ స్టంట్‌. అనుకోకుండా బిపిన్‌ రావత్‌ చనిపోతే ఆయన ఫొటోలను ఉత్తరాఖండ్‌లో బీజేపీ జెండాలపై ముద్రించి ప్రచారం చేసుకొంటున్నారు. ఇదేం నాన్సెన్స్‌. దీన్ని ఎలా అర్థం చేసుకోగలం. బీజేపీ కావాలనే సర్జికల్‌ స్ర్టైక్స్‌ను వాడుకొంటున్నది. ఇదే అభిప్రా యం దేశమంతటా ఉన్నది. సరిహద్దుల్లో కొట్లాడుతున్నది సైనికులు. త్యాగాలు చేస్తున్నది మరణిస్తున్నది సైనికులు. క్రెడిట్‌ దక్కితే ఆర్మీకి, జవాన్లకు దక్కాలి. వాళ్లకు సెల్యూట్‌ చేయాలి. బీజేపీ ఎలా క్రెడిట్‌ కొట్టేస్తుంది? అని విమర్శలు చేశారు.

రాహుల్‌ గాంధీ ముత్తాత దేశం కోసం సంవత్సరాల పాటు జైలుకు వెళ్లాడు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. వాళ్ల కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది. దేశం కోసం పనిచేస్తూ వాళ్ల నానమ్మ ప్రాణాలు కోల్పోయింది. చంపేశారు. వాళ్ళ నాన్నను కూడా చంపేశారు. వాళ్లను పట్టుకొని ఏం మాట్లాడుతాడు ఆ అస్సాం ముఖ్యమంత్రి? ఇదేనా తరీఖా. ప్రధానమంత్రి ఆయనను శభాష్‌ అంటాడా. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మరోసారి అడుగుతున్న.. నేను బీజేపీని ప్రశ్నిస్తున్నా.

రాహుల్‌ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ

ఈ సంస్కారం లేని మాటలను సహించే ప్రసక్తే లేదు. వాళ్లను విడిచిపెట్టేదే లేదు. ఆ యనతో క్షమాపణ చెప్పించండి. ఇలా మాట్లాడటం బీజేపీ సంస్కారమా? ఎంపీని, చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని పట్టుకొని ఏ తండ్రికి పుట్టినవ్‌ అని అడగవచ్చునా? ఇంతటి కుసంస్కారం ఉండవచ్చునా? ఇది పద్ధతేనా? ఎంత వరకు కరెక్టు? ఏమనిపిస్తది? ఇది దేశమా? చాలా బాధాకరం.

ఈ సంస్కృతిని బీజేపీ ప్రోత్సహిస్తుందా? ‘దేశ్‌ కే జనతా హోషియార్‌ హోకే దూద్‌ కా దూద్‌ పానీ కా పానీ కర్నా చాహియే. హిందూస్థాన్‌ ఏక్తా. సమగ్రత, వికాస్‌కే నయా ఉమర్‌ సే. నయా దిశామే చల్నా’. అది అత్యవసరం. శాంతిపూర్వకమైన, ప్రేమపూర్వకమైన దేశాన్ని నిర్మించాలి. అందుకు బీజేపీని తరిమికొట్టాలి. అందుకు యువత ముందుకురావాలె. బీజేపీ భ్రమల నుంచి బయటపడాలె. ఎక్కడికి పోతున్నామో ఆలోచించాలె. బీజేపీ కుసంస్కారంతో చేసే పనుల పర్యావసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.