Hyd, Sep 12: రైతులు మరో ఆందోళనకు దిగకముందే విద్యుత్ సవరణ బిల్లు 2022ను (Electricity Amendment Bill 2022) ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM K Chandrashekhar Rao) సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సంస్కరణల పేరుతో వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విద్యుత్ సంస్కరణల బిల్లు అమలైతే వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు ఏర్పాటు చేయాలని, తమ పొలాల్లోనే కూలీలుగా మారే రైతులకు ఇది మరణశాసనమని అన్నారు. విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ‘‘మోదీజీ..రైతుల కోసం విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోండి.. చట్టం చేసి ఉపసంహరించుకోవడం మీకు అలవాటు. భూసేకరణ ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకోవడమే కాదు.. క్షమాపణ చెప్పారని సీఎం అన్నారు.
"ఏదైనా ఇబ్బంది రాకముందే విద్యుత్ సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోండి. ప్రజలు నిలబడి మరో ఆందోళన ప్రారంభించే ముందు, మా డిమాండ్‌ను గౌరవంగా అంగీకరించండి" అని ఆయన అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు అమర్చడాన్ని తెలంగాణ ఎన్నటికీ అంగీకరించదని, వ్యవసాయ రంగానికి 24X7 ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలను ఆమోదిస్తే రాష్ట్రంలోని 39 లక్షల రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.
రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని సీఎం గుర్తుచేశారు.
మన దేశంలో రైళ్లు, ఎల్‌ఐసీ సహా అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు. ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్ రంగాలే మిగిలాయి. సంస్కరణల పేరుతో వాటినీ అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్రం మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారతారు. ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు ఎగతాళి చేస్తున్నారు. వైద్యకళాశాల, నవోదయ విద్యాలయం ఇవ్వాలని కోరితే ఒక్కటీ ఇవ్వలేదు. వ్యవసాయ రంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదు. నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధించారు. కేంద్రం అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్లే సాగు రంగం సమస్యల్లో ఉందని సీఎం అన్నారు.
బీజేపీకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణలో 3 తోకలున్నాయి.. మమ్మల్ని పడగొడతామని అంటున్నారు. మేకిన్ ఇండియా పూర్తిగా అబద్ధపు ప్రచారం. మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. అధికార మదం నెత్తికెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచిపనైనా చేసిందా? యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా? ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది. సమయం వచ్చినపుడు ప్రజలు తమ బలమేంటో చెబుతారని కేసీఆర్ మండిపడ్డారు.
ఏపీకి రూ.3వేల కోట్ల విద్యుత్ బకాయిలు.. మరో రూ.3వేల కోట్ల వడ్డీ కట్టాలని తెలంగాణకు కేంద్రం చెప్పింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి ఏపీ నుంచి తెలంగాణకు రూ.17వేల కోట్లు రావాలి. కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉంది. మీరు చెబుతున్న రూ.6వేల కోట్లు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని కేంద్రం ఇప్పించాలన్నారు.
గతంలో 20 ఎకరాలున్న రైతు కూడా నగరాలకు వచ్చి కూలిపనులు చేసుకునే పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతుల బాధలు ఇప్పుడే తీరుతున్నాయి. 66 లక్షల మందికి మేం ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన కార్యక్రమం. రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. 1.30కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారని సీఎం అన్నారు.
బిహార్‌కు ఓ దరిద్రుడు బీమారి స్టేట్ అని పేరు పెట్టారని, అక్కడ పవర్ ప్రాజెక్టులు వస్తే.. బిహార్ అద్భత స్టేట్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలతో తెలంగాణ రూ. 25 వేల కోట్లు నష్టపోతుందన్నారు. విద్యుత్ మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్రం అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆర్ఈసీ లోన్‌లు ఆపాలని కొత్త కండీషన్ పెడుతున్నారని, దీనిపై కోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రూ.4 వేలకు టన్ను దొరికే బొగ్గును.. రూ.30 వేలకు కొనమని చెప్పడమే కేంద్ర విద్యుత్ సంస్కరణ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. విశ్వగురు అంటే పేదలకు సహాయం చేయాలి.. కానీ వచ్చేది అడ్డుకోవడం కాదన్నారు. కేంద్రం పిట్ట బెదిరింపులకు తెలంగాణ భయపడదన్నారు. బీజేపీ సర్కార్ శాశ్వతం కాదని.. 18 నెలల్లో సాగనంపుతామన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులు వెనక్కి తీసుకోవాలని సభా ముఖంగా డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించారు.