Hyderabad, Oct 19: వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం (flood relief operations) ప్రకటించారు. వరద నష్టంపై సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం.. వరదల్లో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేందుకు మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు (Telangana CM KCR announces Rs 550 crore package) తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని (Flood Relief Package) ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ వరద బాధితులకు తమిళ నాడు సీఎం రూ. 10 కోట్లు విరాళం
తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుంది. హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.
Update by ANI
Telangana Chief Minister announces that all the houses which were totally damaged in rain would be given an assistance of Rs one lakh each and partially damaged would be given Rs 50,000 each: State CM's Office https://t.co/B71NPu39Bn
— ANI (@ANI) October 19, 2020
వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లల్లో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, మళ్లీ మమూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మూడు రోజుల పాటు భారీ వర్షాలు,జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరిన మంత్రి కేటీఆర్
కాగా గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని సీఎం అన్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు.
నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలి. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.
ఇదిలా ఉంటే వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిసామి ఓ లేఖ రాశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ప్రజల తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్టు లేఖలో తెలిపారు. అంతేగాక దుప్పట్లు తదితర సామాగ్రి కూడా అందించనున్నట్టు తెలిపారు. వరదల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.