Hyderabad, Oct 19: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం (More rains coming in next few days) ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యలను కేటీఆర్ సమీక్షించారు.
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం (Heavy Rainfall Warning) ఉందని తెలిపారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officials) అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సూచించారు. ముంపు ప్రజల ఆశ్రయం కోసం కమ్యూనిటీ, ఫంక్షన్ హాల్స్‌ను సిద్ధం చేయాలని చెప్పారు.
Here's Minister for IT, Industries Telangana Tweet
Evacuate people in low lying areas which face risk of inundation. Structurally weak houses and buildings should be identified and inmates have to be evacuated immediately: MA&UD Minister @KTRTRS
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 19, 2020
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో కురిసిన వాన చరిత్రలో రెండో అతి పెద్ద వర్షం అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మూసీకి వరదలు వచ్చిన 1908లో 43 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.మీ. వర్షపాతం నమోదైంది అని తెలిపారు. ఇలాంటి ఉత్పాతం వందేళ్లకు ఒకసారి వస్తుందన్నారు. చరిత్రలో ఈ ఏడాదే ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం కురింది. అలాగే మలక్‌పేట, చార్మినార్, సుల్తాన్‌బజార్, కోఠి, ఖైరతాబాద్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్‌లో వాన పడింది. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లుపై వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికీ పలు కాలనీల్లో నీరు నిలిచే ఉంది.
మళ్లీ దూసుకొస్తున్న ముప్పు, రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ
జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంకా సహాయ చర్యలు చేపడుతున్నారు. ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కరోనా సంక్రమణ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు నిర్వహణ సహాయ బృందాలతో క్రిమి సంహారక మందు స్ప్రే చేయిస్తున్నారు.
వరద బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు విరాళం
హైదరాబాద్ వరద బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి (CM Palaniswamy) రూ. 10 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. తక్షణ సాయం కింద రూ. 1,350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు.. వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే సహాయక చర్యలు చేపడుతామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీల్లోని ప్రజలను కచ్చితంగా ఆదుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మరణించారు. ఇప్పటి వరకు 29 మందికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.