Hyd, Dec 17: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రయివేటీకరణ, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేలతో చర్చించారు. రైతుబంధు పథకం (CM KCR on Rythu Bandhu) యథావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అలాగే ఇతర పంటలు వేసేలా రైతుల్లో (Paddy Farmers) చైతన్యం తేవాలని అధికారులకు సూచించారు. దళిత బంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలి. ఈ పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ (Telangana Cm KCR) తెలిపారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రం వైఖరి పట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తయడంతో.. ఈ విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలని మంత్రులకు సూచించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి..తేల్చుకొని రండని ఆయన స్పష్టం చేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్నారు. తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.