Telangana: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం, నూతన జోనల్ వ్యవస్థ కోసమే ఇంతకాలం ఆలస్యమైందని వెల్లడి; ఈనెల 11న రాష్ట్ర కేబినేట్ భేటీ
Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, June 9:  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

కాగా, ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై కేబినేట్ చర్చించనుంది.