Hyderabad, Nov 15: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభవార్తను (Good News to RTC Employees) అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల (RTC Employees) జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. వీటి కోరకు దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఈ మేరకు ఆర్టీసీపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీనియర్ అధికారులతో సమీక్ష (KCR Review) అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే.
కరోనా లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇటీవల అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా 20 శాతం సర్వీసులు ప్రారంభమయ్యాయి. నగర వాసుల అవసరం దృష్ట్యా బస్సు సర్వీసులను 50 శాతం పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో సోమవారం నుంచి గ్రేటర్‌లో 50 శాతం బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు చేస్తామని ప్రకటించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ప్రజాదరణ పొందిందని చెప్పారు. భూరిజిస్ట్రేషన్ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైనట్టు ప్రజలు భావిస్తున్నారని, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలను అధిగమించనుందన్నారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు.