Telangana: వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం, వచ్చే నెలలో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపైనా చర్చించిన సీఎం, రేపు పీవీ ఉత్సవాలపై సమీక్ష
Telangana CM KCR | File Photo

Hyderabad, August 27: యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని సీఎం వివరించారు. కరోనా లాక్డౌన్ కారణంగా వీసీల నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

అలాగే సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు.

మరోవైపు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై కూడా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. దీనికి సంబంధించి రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. పీపీ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు.