Hyderabad, October 29: తెలంగాణలో ఈరోజు నుంచి 'ధరణి' పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ధరణి పోర్టల్‌ను గురువారం (అక్టోబర్ 29,2020) రోజున అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ భారతదేశానికి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని చెప్పారు.
ఈ పోర్టల్‌లో అక్రమ రిజిస్ర్టేషన్లకు తావు ఉండదు. రిజిస్ర్టేషన్ల కోసం పైరవీలు చేసే అవసరం లేదన్నారు. ఎవరికివారే మీ-సేవా, ధరణి పోర్టల్ కార్యాలయానికి వెళ్లి భూములు రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చు అని సీఎం తెలిపారు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. నమూనా పత్రాల ఆధారంగా ఎవరి సహాయం అవసరం లేకుండా, తమకు తాముగానే రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేసుకోవచ్చని కొత్తగా జరిగే క్రయ, విక్రయాల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతుందని సీఎం తెలిపారు. భూ రిజిస్ర్టేషన్ల విషయంలో పాత రిజిస్ర్టేషన్ ఛార్జీలే వర్తిస్తాయని ఆయన తేల్చిచెప్పారు. రిజిస్ర్టేషన్ ఛార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
Watch CM KCR Speech Here
Live: CM Sri KCR speaking after formally launching #Dharani Portal https://t.co/XgC8fIoQ3y
— Telangana CMO (@TelanganaCMO) October 29, 2020
ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, తెలంగాణలోని మొత్తం ఒక కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూములు ఈ పోర్టల్‌లో దర్శనమిస్తాయి. విదేశాల్లో ఉన్న వారు సైతం ఎక్కడినుంచైనా భూముల వివరాలు చూసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంతా చూసుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో భూముల వివరాలు బయటపడుతాయి. పారదర్శకంగా పూర్తిస్థాయిలో ఈ పోర్టల్ నిర్వహణ ఉంటుంది. ఇక నుంచి భూములను గోల్‌మాల్ చేసే ఆస్కారం లేదని సీఎం వివరించారు.
ఇంతకుముందు దేవాదాయ, వక్ఫ్ మరియు అటవీ భూములను ఎవరికీ పడితే వారికి రిజిస్ర్టేషన్లు చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు జరగవు అని సీఎం తేల్చిచెప్పారు. అన్ని భూములు ఆటోలాక్‌లో ఉంటాయి. ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ ఓపెన్ చేద్దామన్న అవి ఓపెన్ కావు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.