Hyd, Nov 8: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని వదిలే ప్రశ్నే లేదని.. వెంటాడుతూనే ఉంటానని కేసీఆర్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ నువ్వో తోకగాడివి..నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్.. ట్రాక్టర్ డ్రైవర్ వా? అంటూ మండిపడ్డారు. నాది ఫాంహౌజ్ కాదు.. ఫార్మర్ హౌజ్..అందులో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్ అంటూ బండి సంజయ్‌పై (BJP State President Bandi Sanjay Kumar) ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో (CM KCR Press Meet) మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ గురువు నేర్పిన సంస్కారం ఇదేనా.. అని హితవు పలికారు. నా ఫామ్ హౌస్ దున్నడానికి బండి సంజయ్ ట్రాక్టర్ డ్రైవరా? అంటూ ఎద్దేవా చేశారు. నాది ఫామ్‌హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్. తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టానని కేసీఆర్ తెలిపారు. సూట్ కేసులు ఇచ్చేది మీరు.. మేము కాదని కేసీఆర్.. బీజేపీపై రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అసలు విషయం పక్కకు పెట్టి పనికిరాని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం వడ్లు కొంటదా? లేదా? అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బండి సంజయ్ తోకముడిచాడని, అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడాడని ధ్వజమెత్తారు.
నా ఫాంహౌజ్ దున్నుతవా..? నేనేం తప్పుజేసిన.. నా వారసత్వంగా వచ్చిన భూమి అప్పర్‌మానేరులో పోతే ఇంకోచోట భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్న.. అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో ఇల్లు అమ్మితే వచ్చిన పైసలకు ఇన్ని కలిపి అక్కడనే భాజాప్తాగా ఇల్లు కట్టుకున్న..భాజాప్తా ఉంటా.. బేజాప్తాగా లేను అని వ్యాఖ్యానించారు. అందుకే ఫాంహౌజ్‌కు వస్తే మెడలు ఇరగ్గొడతా అన్నా అని బండి సంజయ్‌నుద్దేశించి అన్నారు.
తామెప్పుడూ ప్రజలు బాగుండాలనే కోరుకుంటామని, మీలాగా చీప్‌గా వ్యవహరించమని చెప్పారు. రాయలసీమకుపొయ్యి భాజాప్తా చెప్పిన వాళ్లకు కూడా నీళ్లు రావాలని.. మేం భేషన్లు.. బేషజాలు అడ్డుచెప్పం అని కూడా చెప్పిన.. మనకు సరిపోంగ నీళ్లు మిగిలితే ఇస్తే తప్పేంటి..ఇది పక్కకు పెట్టి..పక్క రాష్ట్రం పొయ్యి కేసీఆర్ చాపల పులుసు తిన్నడు అని బదనాం చేస్తున్నరు.. ఎస్ తిన్న.. వాటిజ్ రాంగ్.. అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు.
తెలంగాణలోని కరవు ప్రాంతాలకు నీళ్లు వచ్చాక మిగతా నీటికి తీసుకెళ్తే తమకు అభ్యంతరం లేదని చెప్పామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. గొర్రెల పథకానికి ఎన్‌సీడీసీ బ్యాంక్ నుంచి అప్పుతీసుకున్నామన్నారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారుని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్ పథకం ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయా అని కేసీఆర్ నిలదీసారు.
మిస్టర్ బండి సంజయ్ నేను అడిగేందేంటి.. నువ్వు చెప్పేదేంటి..? తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా..? అంటూ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ లేడు అంటవా? నీకు తలకాయ ఉండే మాట్లాడుతున్నవా? నేను లేకపోతే నువ్వున్నవా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంల కేసీఆర్ ఎక్కడున్నడు అంటున్నవ్.. నువ్వెక్కడున్నవ్.. ఇప్పుడు మోపైనవ్.. అప్పుడు నువ్వు ఎవనికి తెలుసు రాష్ట్రంల అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ పథకాలళ్ల కేంద్రం పైసలు ఉన్నయా? గొర్రెల పథకంల మీ పైసలున్నాయా..? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఈ పథకం కేంద్రం పైసలు ఏకాణ ఉన్నా నేను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఎన్‌సీడీసీ నుంచి అప్పుగా తీసుకొని గొర్రెల పథకం అమలుచేస్తున్నామని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నామన్నారు.
తెలంగాణకు నువ్వు ఏంజేసినవ్ అంటడు ఈ మొగోడు.. తెలంగాణలో హనుమాన్ గుడిలేని ఊరులేదు.. సంక్షేమ పథకం చేరని గ్రామం లేదు..మిషన్ భగీరథ ద్వారా నీళ్లు చేరని ఇల్లు ఉందా తెలంగాణల అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలన్నీ మావే అంటున్న బండి సంజయ్.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
పెట్రోల్ ధరలు ఎందుకు పెంచిన్రు అని అడిగితే పాకిస్తాన్.. అప్ఘనిస్తాన్ పోర్రి అంటరా..?
అరుణాచల్ ప్రదేశ్‌ల చైనా వాళ్లు ఆక్రమించి ఇండ్లు కడుతున్రు అడ్డుకోన్రి అంటే దేశద్రోహి అని ముద్రవేస్తరా? దేశాన్ని కాపాడండి అని అడిగేవాడు దేశద్రోహా? దేశంలోకి పక్క దేశంవాళ్లు చొరబడ్డా ఏమిజేయనోళ్లు దేశద్రోహులా? అని అడిగారు. వడ్లగురించి ఇడ్షిపెట్టి కేసీఆర్ మీద దేశద్రోహి అని ముద్రవేయండని ఢిల్లీనుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే బండి సంజయ్ అసలు విషయం పక్కకు పెట్టి తనపై దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. మిస్టర్ బండి సంజయ్ ఒళ్లు దగ్గరపెట్టుకో..నేను హద్దు మీరి మాట్లాడిననా..? వడ్డు కొంటరా.. కొనరా అంటే హద్దుమీరుడా..? అని ప్రశ్నించారు.
పెట్రోల్ ధరలు పెంచి దేశ ప్రజల మీద భారం వేయొద్దన్నారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నును కేంద్రం విత్‌డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం పన్ను విత్‌డ్రా చేసుకుంటే పెట్రోల్ ధర లీటర్ 60కే వస్తుందన్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా.. లేదో.. తమ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేసారు. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘానిస్థాన్ వెళ్లాలని చీప్‌గా మాట్లాడతారా అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజిల్, పెట్రోల్‌పై సెస్ విత్‌డ్రా చేయాలన్నారు. సెస్ విత్‌డ్రా చేస్తరా, లేదో కేంద్రం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేసారు.
యాసంగిలో వడ్లు పండించాలని మీరు చెప్పలేదా అని కేంద్రాన్ని కేసీఆర్ నిలదీసారు. 62 లక్షల ఎకరాల్లో వరి ఉందంటే, లేదని వారు బుకాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరు హెలికాప్టర్లు పెట్టి బీజేపీ నాయకులరకు వరి పంటని చూపిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల పక్షాన ప్రశ్నిస్తే దేశ ద్రోహులమా అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు తాము దేశద్రోహులం కాదా అని ఆయన నిలదీసారు.
సమస్యలపై గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశం దురాక్రమణకు గురికాకుండా చూడాలని చెబితే దేశద్రోహులని ముద్ర వేస్తారా అని ఆయన మండిపడ్డారు. తాను చైనాలో డబ్బు దాస్తున్నానని బీజేపీ నాయకులు చెబుతున్నారన్నారు. బీజేపీ.. అబద్ధాల మీద బతికే పార్టీ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఎప్పుడు విత్‌డ్రా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.