New Delhi, December 06: తెలంగాణ ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రేవంత్ పేరును (CLP Leader) పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీలో ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ఈనెల 7వ తేదీ ఉదయం 10.28 గంటలకు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం (Revanth Reddy Swearing) చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanthi Kumari) ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యి.. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
అనంతరం ఆయన ఎయిర్‌పోర్టు నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్‌తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ చాలా సేపు కొనసాగింది. క్యాబినెట్ (Telangana Cabinet) కూర్పుపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌లో ఎవరెవరు ఉండాలి, సామాజిక సమీకరణాల మేరకు ఎవరికి అవకాశం కల్పించాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్‌తోనూ భేటీ అయ్యారు. గతంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాగూర్ పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారు.
రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో రేవంత్ సమావేశం అవుతారు. ఉదయం 10గంటలకు ఖర్గేతో భేటీ అవుతారు.. ఆ తరువాత రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదేవిధంగా 7న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో కేబినెట్ కూర్పుపైనా రేవంత్ చర్చించనున్నారు.