Revanth Reddy as New Telangana CM (Photo-X)

Hyd, Dec 5: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.

భారీ విజ‌యాన్ని అందించిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 7వ తేదీన ఉద‌యం 10:28 గంట‌ల‌కు సీఎంగా రేవంత్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని తెలిపారు. సీనియ‌ర్లు అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంది. అంతా టీమ్‌గా ప‌ని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవ‌రనే విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం

ఇదిలా ఉంటే ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణం చేయనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్నో రాజ‌కీయ అటుపోట్లు, మరెన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్‌ రెడ్డి ప్రస్థానం ఆసక్తికరమే. జడ్పీటీసీ మెంబర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన రేవంత్‌.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించారు. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త

2009లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . కాంగ్రెస్‌ అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు. అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్‌ లీడర్‌గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరుతానే వార్తలు గుప్పుమనడంతో ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించింది, చివరకు 2017 అక్టోబర్‌ 31వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరారు.

2018 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.రేవంత్‌ రెడ్డికి 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్‌లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు.

రేవంత్‌రెడ్డి 1969, నవంబర్‌ 8వ తేదీన మహబూబ్‌నగర్‌ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్‌ నుంచి బీఏ చేశారు. జర్నలిస్ట్‌గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్‌రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్‌రెడ్డి తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేసుకున్నారు.