Telangana CM Selection: తెలంగాణ సీఎం రేసులో మరో ఇద్దరు, ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం, హైదరాబాద్ బయలుదేరిన డీకే శివకుమార్, కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం
Congress leader Mallikarjun Kharge. (Photo Credits: PTI)

Hyd, Dec 5: తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మురళీధరన్‌లు మొగ్గు చూపారు. రాహుల్ గాంధీ... రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినప్పటికీ పార్టీని దృష్టిలో పెట్టుకొని మల్లు భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

సీఎం ఎంపికకు ముందు మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్, నేను చేసిన 109 రోజులు పాదయాత్రతో కాంగ్రెస్ గెలిచిందంటూ..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... మల్లు భట్టి విక్రమార్క వైపు మొగ్గు చూపారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీ, కర్ణాటక మంత్రి కేకే జార్జ్‌లు కూడా మల్లు భట్టి విక్రమార్కను సీఎంగా చేయాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు జార్ఖండ్ కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ మొగ్గు చూపారు. అలాగే దీపాదాస్ మున్షీ... మల్లు భట్టితో పాటు ఉత్తమ్ కుమార్ పేరును కూడా సూచించారు. దామోదర రాజనర్సింహ పేరును కూడా దీపాదాస్ మున్షీ, కేకే జార్జ్ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డిని సీఎంని చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకునే యత్నం

ఇదిలా ఉంటే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

తెలంగాణ కొత్త సీఎంకు తెలుపు రంగులో సరికొత్త కాన్వాయ్ సిద్ధం (వీడియో)

ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై ఓ డిజిటల్ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.

ఇదిలా ఉంటే రేవంత్ సీఎం అభ్యర్ధిత్వంపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తన అనుయాయుల వద్ద డీకే శివకుమార్ వెల్లడించినట్లు సమాచారం. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌ను సీఎం ఎలా చేస్తారని కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని... పార్టీలో సీనియర్ అయిన తనను కాదని సిద్దరామయ్యను సీఎంను చేయలేదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సిద్దరామయ్య కూడా రేవంత్ లాగానే వేరే పార్టీ నుంచి వచ్చిన వారేననని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ పేరే చెప్పారని అనుయాయుల వద్ద డీకే శివకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది.

మల్లికార్జున ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు.

సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు. అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును డీకే హైదరాబాద్‌లో ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన పదవుల కేటాయింపుపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఖర్గేతో భేటీకి ముందు ఉత్తమ్‌ కుమార్, భట్టి విక్రమార్కతో డీకే, ఠాక్రేలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.