Telangana CM Selection: రేవంత్ రెడ్డా లేక భట్టి విక్రమార్కా, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ, చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన డికే శివకుమార్
Revanth Reddy and Mallu Bhatti Vikramarka (photo-Video Grab)

Hyd, Dec 4: తెలంగాణలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. ఈరోజు మధ్యాహ్నం... కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు.

అయితే సీఎం అభ్యర్థి ప్రకటన, ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చలు జరిపి సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఏ నేతకు ఏ పోర్ట్‌పోలియో ఇవ్వాలో కూడా చర్చించనున్నారు.

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్, ఈ రోజు రాత్రికి సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు

ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. గచ్చిబౌలిలోని ఎల్లా హొటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. దీనిని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు.

రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరా? అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సీఎం పీఠం కోసం యడ్యూరప్ప, డీకే శివకుమార్ మధ్య గ్రూప్ రాజకీయాలు నడిచాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అక్కడ సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. ఇప్పుడు ఇదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతోంది.ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడిచిన్నట్లు సమాచారం. సమావేశం జరిగిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ నుంచి సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ వెళ్లిపోయారు.

డీకే శివకుమార్‌తో పాటు నలుగురు ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది. దీంతో ఐదుగురు నేతలు ఢిల్లీకి పయణమయ్యారు. చర్చలకు సంబంధించిన సారాంశంపై పరిశీలకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పరిశీలకులు, డీకే శివకుమార్‌ కలిసి కాంగ్రెస్‌ ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గేతో మంగళవారం ఉదయం సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్‌ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. అయితే సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్‌ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు.