Communal Tensions Flare Up In Telangana's Asifabad After Tribal Woman Raped, Brutally Assaulted By Auto Driver

Jainoor, Sep 5: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటనలో ఇరువురు దుకాణాలు తగులబెట్టారు. మంటలు చెలరేగి పొగ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను నిలిపివేసిన పోలీసులు, 144వ సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నిందితుడు షేక్ మగ్దూంను అరెస్ట్ చేసిన పోలీసులు... బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు, ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు

ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి సీతక్క ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆదివాసీ సంఘాలు శాంతించాయి.

అక్కడ అసలు ఏం జరిగింది ?

ఆగస్ట్ 31న సమీపంలోని గ్రామానికి వెళ్లేందుకు జైనూర్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలైన ఆదివాసీ మహిళ నిలబడింది. ఆ తర్వాత ఆమె ఆటో రిక్షాను ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు అరిచే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె పడిపోవడంతో... డ్రైవర్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు.

Here's Video

మహిళ పడిపోవడాన్ని కొంతమంది చూశారు. ఆమె ప్రమాదంలో గాయపడిందని భావించి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబర్ 2న స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడు షేక్ మగ్దూంను అరెస్ట్ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.

జైనూర్ హింసపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన డీజీపీతో మాట్లాడారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒవైసీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ చెప్పారన్నారు. అదనపు బలగాలను తరలించినట్లు చెప్పారని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.