Telangana's Covid Update: 8 రోజులకు రూ.8.68 లక్షలు బిల్లు, సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై మండిపడిన తెలంగాణ హైకోర్టు, రాష్ట్రంలో తాజాగా 1,286 కరోనా కేసులు, 68,946కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Coronavirus Outbreak. | (Photo-PTI)

Hyderabad, August 4: తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు (Telanganas's Covid Update) నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 18,708 యాక్టివ్‌ కేసులు ఉండగా, 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య (Coronavirus Deaths) 563కు చేరింది. సిద్ధరామయ్యకు కరోనా, స్వీయ నిర్భంధంలోకి త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్, దేశంలో తాజాగా 52,050 కేసులు నమోదు, 18,55,745కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య

కాగా, ఐసోలేషన్‌లో 11,935 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో (Telangana) చేసిన కరోనా పరీక్షలు 5లక్షలు దాటాయి. గడిచిన 24గంటల్లో 13,787 టెస్టులు చేయగా, మొత్తం 5,01,025 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు నమోదు చేసిందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై (Sunshine Hospital) తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో సన్‌షైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ సైనికుడు రామ్‌కుమార్‌ శర్మ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది.

తన తండ్రి శవాన్ని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాఖీపౌర్ణమి సందర్భంగా సెలవు దినమైనా న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ హౌస్‌ మోషన్‌ రూపంలో సోమవారం అత్యవసరంగా విచారించారు. రామ్‌కుమార్‌శర్మను కరోనాతో గతనెల 24న సన్‌షైన్‌ ఆసుపత్రిలో చేర్చారని, ఆదివారం (2న) సాయంత్రం 4.40 ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘీ నివేదించారు.

8 రోజులకు రూ.8.68 లక్షలు బిల్లు వేశారని, రూ.4 లక్షలు చెల్లించినా మొత్తం డబ్బు కడితేనే శవాన్ని ఇస్తామంటున్నారని తెలిపారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ... అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వెంటనే మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.